Bhupalpally District : వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా - భారీగా ప్రామిసరీ నోట్లు స్వాధీనం, 12 మందిపై కేసులు
Jayashankar Bhupalpally District News: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై కొరడా ఝలిపించారు పోలీసులు. 12 మందిపై కేసులు నమోదు చేశారు.
Jayashankar Bhupalpally District News: అక్రమ వడ్డీ వ్యాపారులు జనాలను జలగల్లా పీల్చుకుతింటున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని పెద్ద మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ అమాయకుల నడ్డి విరుస్తున్నారు. ఆరోగ్యం బాలేకనో.. ఇంట్లో అవసరాలకో వారి నుంచి డబ్బులు తీసుకుంటున్న జనాలు వ్యాపారులు డిమాండ్ చేసినంత వడ్డీలు చెల్లిస్తూ ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్రమ వడ్డీ దందా పేట్రేగిపోతుండగా.. తాజాగా భూపాలపల్లి జిల్లా పోలీస్ ఆఫీసర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తనిఖీలు చేపట్టి 12 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు పెద్ద మొత్తంలో ఖాళీ చెక్కులు, ల్యాండ్ పేపర్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వడ్డీ వ్యాపారుల బాగోతంపై పోలీసులు యాక్షన్ చేపట్టడం జిల్లాలో హాట్ గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం జోరుగా నడుస్తోంది. కొంతమంది వడ్డీ వ్యాపారులు ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని ఎక్కువ మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారు. వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో కొంతమంది అమాయకుల నుంచి భూములు, ఇతర ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట విషయం జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లింది.
12 టీమ్లు.. ఏకకాలంలో తనిఖీలు
అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులు ముందు జాగ్రత్తగా జనాల ల్యాండ్ పేపర్లు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ బుక్స్, ఇతర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ సేకరించి పెట్టుకుంటున్నారు. అధిక వడ్డీ భారంతో డబ్బులు సకాలంలో కట్టలేని పక్షంలో వాటిని జప్తు చేసుకుంటున్నారు. దీంతోనే జనాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో వడ్డీ వ్యాపారుల జాబితా తయారు చేయించారు. అందులో అక్రమంగా దండుకునే వ్యాపారులను లిస్ట్ ఔట్ చేశారు. ఆ తరువాత భూపాలపల్లి డీఎస్పీ ఏ.సంపత్ రావు, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 12 టీమ్ లు ఏర్పాటు చేశారు. ఆ తరువాత బుధవారం రాత్రి పోలీసులు ఏకకాలంలో రెండు డివిజన్ల పరిధిలోని భూపాలపల్లి, కాటారం, మహదేవ్ పూర్ లోని అక్రమ వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వడ్డీ వ్యాపారుల ఇళ్లు, ఆఫీస్లలో తనిఖీ చేసి 12 మంది అక్రమ దందా చేస్తున్నట్టు నిర్ధారించారు. ఈ మేరకు 12 మంది వడ్డీ వ్యాపారుల నుంచి 193 ప్రామిసరీ నోట్లు, 93 ఏటీఎం కార్డులు, 28 బ్యాంకు పాసు బుక్కులు, 109 బ్యాంకు చెక్కులు, 13 బాండ్ పేపర్లు, 11 పట్టా పాస్ బుక్కులు, రూ.3,71,240 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వడ్డీ దందా చేస్తున్న 12 మందిపైనా కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, కాటారం డీఎస్పీ జి. రామ్మోహన్ రెడ్డి, భూపాలపల్లి, కాటారం, మహదేవ్ పూర్ సీఐలు నరేష్ కుమార్, నాగార్జున రావు, రాజేశ్వర్ రావు, సీసీఎస్ సీఐ రవీందర్, భూపాలపల్లి, కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.
అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తే సీరియస్ యాక్షన్: జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
అక్రమ వడ్డీ వ్యాపారాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే దందా చేస్తున్న వాళ్లపై కొరడా ఝుళిపించారు. 12 మందిపై కేసులు నమోదు చేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పేద ప్రజల నుంచి అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారుల పై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ వడ్డీ వ్యాపారులు చేస్తున్న ఆర్థిక మోసాలను తట్టుకోలేక కొందరు బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. పేదలను అధిక వడ్డీతో ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇంకా వడ్డీ వ్యాపారుల బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజలు అనుమతులు లేని వడ్డీ, ఫైనాన్స్ వ్యాపారస్తులను నమ్మవద్దని కోరారు.
(రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)