Hyd Rains: హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. మరో 2 రోజులు వర్షాలు..!
13 October 2022, 8:04 IST
- rains in telangana: హైదరాబాద్లో బుధవారం రాత్రి వర్షం దంచికొట్టింది. కాలనీలు, గల్లీలు వరదనీటితో నిండిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోరబండలో అపార్ట్మెంట్ సెల్లార్లలోకి వరద నీరు చేరగా.. వరద ప్రవాహంలో ఆటోలు, బైకులు కొట్టుకుపోయాయి.
హైదరాబాద్ లో భారీ వర్షం
Heavy Rain in Hyderabad City: హైదరాబాద్‌లో వర్షం మళ్లీ దంచికొట్టింది. బుధవారం రాత్రి ఉరుములు మెరుపులతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కుండపోత కురిసింది. మరోవైపు పిడుగుల మోతతో నగరం దద్ధరిల్లిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో వాన బీభత్సం సృష్టించింది. నగరంలోని అన్ని ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. ఏ ఒక్క ప్రాంతాన్నీ వరుణుడు వదిలిపెట్టలేదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మొదలైన వాన అర్ధరాత్రి 12 వరకు కురిసింది.
ఖైరతాబాద్, మాసాబ్‌ట్యాంక్, రాజేంద్రనగర్, బండ్లగూడ, మణికొండ, గండిపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేటతదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రసూల్‌పురాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వరద నీరు చేరింది.
కొట్టుకుపోయిన వాహనాలు...
బోరబండ సహా అనేకచోట్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు కొట్టుకుపోయాయి. రహమత్ నగర్ లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రసూల్‌పురాలోనూ ఇళ్లలోకి నీరు చేరింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని మెట్రో స్టేషన్ల కింద భారీగా నీరు చేరింది. బాలానగర్, కూకట్‌పల్లిలో అత్యధికంగా 10.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత తిరుమలగిరిలో 9.55 సెం.మీ.. బొల్లారంలో 9.43 సెం.మీ.. వెస్ట్ మారేడుపల్లి 9.33 సెం.మీ.. కుత్బుల్లాపూర్ 9.20 సెం.మీ.. ఆర్సీపురం 9.08 సెం.మీ.. భగత్ సింగ్ నగర్ 8.85 సెం.మీ వర్షపాతం కురిసింది.
మహబూబ్‌నగర్‌ను భారీ వర్షం ముంచెత్తింది. లోతట్టుప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొన్ని కాలనీల్లో మోకాళ్లలోతు వరకు నీరు రావడంతో జనం సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్… అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలు, లోతట్టు ప్రాంతాల్లోని పరిస్థితులపై మాట్లాడారు. మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ శాఖ తెలిపింది.