Telangana Rains: దంచికొడుతున్న వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Rains In Telangana: అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగుల, వంకలు పొంగిపోర్లుతున్నాయి.
Telangana weather updates: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గడిచిన రెండు మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలోని కాగ్నా నది, కోకట్ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ విడుదల చేసింది.
మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలలో జోరు వాన పడింది. పంజాగుట్ట అంబర్‌పేట్, చిక్కడపల్లి, రాజేంద్రనగర్, శివరాంపల్లి, శంషాబాద్, ఆరాంఘర్, బండ్లగూడలో మోస్తరు వర్షం పడింది. చిలకలగూడ, బేగంపేట్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మల్కాజ్‌గిరి, కీసర ప్రాంతాల్లోనూ విస్తారంగా పడ్డాయి. రహదారులపై నీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు.
ఈ జిల్లాలకు అలర్ట్…
IMD Alert: భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, మబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది.
శుక్రవారం వరంగల్ నగరంలో భారీ ఉదయం కురిసింది. ఉదయం నుంచే వాన మొదలుకావటంతో రోడ్లన్నీ జలమయ్యం అయ్యాయి. రోడ్లపైకి వచ్చేందుకు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఏపీలోనూ వర్షాలు…
Rains in Andhrapradesh: ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్రాను అనుకుని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలాచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఇలానే వానలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులు స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.