TSRTC MD Sajjanar : అలాంటి వాటిని ఏ మాత్రం సహించం, కఠిన చర్యలు తీసుకుంటాం - ఆర్టీసీ ఎండీ సజ్జనార్
28 December 2023, 14:43 IST
- TSRTC Latest News: ఆర్టీసీ సిబ్బందిని దూషించటం, దాడులు చేయటం వంటివి చేస్తే సహించేదే లేదన్నారు ఎండీ సజ్జనార్. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్(ఫైల్ ఫొటో)
TSRTC MD Sajjanar : తెలంగాణ ఆర్టీసీకి సిబ్బంది వెన్నుముకలాంటి వారి అన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. వారంతా అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారని చెప్పారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుందన్న ఆయన… మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదన్నారు.
ఇలాంటి ఘటనలకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు సజ్జనార్. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని… ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారని తెలిపారు. పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి.. విచారణ చేపట్టారని వివరించారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరారు.
TSRTC : తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటీవలే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ కారణంగా పురుషులకు సీట్లు కాదు కదా నిలబడటానికి కూడా చోటు లేకుండా పోయింది. దూర ప్రాంతాలకు కూడా పురుషులు గంటల తరబడి నిలబడే ప్రయాణం చేస్తున్నారు. దీంతో కొందరు పురుషులు ఆర్టీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీపై ఒత్తిడి పెరిగింది. టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు బస్సులో ఈ సీట్లు మహిళలకు మాత్రమే అని రిజర్వ్ చేసినట్లు ఇప్పుడు పురుషులకు కూడా అదే తరహాలో రిజర్వ్ చేసే ఆలోచన చేస్తుందట తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. కాగా పురుషులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఆర్టీసీ అధికారులు పడ్డారట. ఇందుకోసం బస్సులో ఉండే 55 సీట్లలో కనీసం 20 సీట్లను పురుషులకు ప్రత్యేకంగా కేటాయించేలా అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని డిపోల నుంచి మ్యానేజర్ల నుంచి ఉన్నతాధికారులు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మరోవైపు పురుషులకు సీట్లు కేటాయిస్తే వ్యతిరేకత వస్తుందా? అని ఆలోచిస్తున్నారట.