TSRTC Merger Bill : టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు ... విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం
Governor Tamilisai Soundararajan: టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేశారు. ఫలితంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియకు లైన్‌క్లియర్ అయిపోయింది.
Governor Tamilisai Soundararajan On TSRTC Bill: కొంత రోజులుగా ఆర్టీసీ విలీన బిల్లుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం సభలో ఆమోదించి… గవర్నర్ కు పంపినప్పటికీ బిల్లులోని పలు అంశాలపై గవర్నర్ సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. పలుమార్లు ప్రభుత్వానికి తిప్పి పంపారు. అయితే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఫలితంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందినట్లు గవర్నర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు ప్రభుత్వోద్యోగులుగా మారనున్నారు. అయితే ఈ బిల్లుకు ఆమోదం వేసే విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయనే చెప్పొచ్చు. ఆర్టీసీ విలీనం బిల్లు ఆర్థిక శాఖకు సంబంధించిన బిల్లు కావడంతో సభలో పెట్టక ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ టైంలో బిల్లులో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి అనుమతి ఇచ్చేందుకు గవర్నర్ అంగీకరించలేదు. శాసనసభ ఆఖరి రోజు కూడా ఆమోదం లభించదేమో అని గ్రహించిన ఆర్టీసీ సిబ్బంది రాజ్‌భవన్ వద్ద ధర్నాకు దిగారు. ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచిన గవర్నర్ తనకు ఉన్న అనుమానులు వారికి వివరించారు. చివరకు ఆఖరి నిమిషంలో సభ ముందుకు ఆర్టీసీ విలీనం బిల్లు వచ్చింది. ఫలితంగా సభామోదం పొందింది. ఆ తర్వాత గవర్నర్ కార్యాలయానికి చేరినప్పటికీ… పలు సందేహాలను వ్యక్తం చేశారు గవర్నర్. వీటికి ప్రభుత్వం తరపున జవాబులు కూడా ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని అంశాల్లో న్యాయ సలహాలను కూడా తీసుకున్నారు గవర్నర్ తమిళిసై. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత… ఈ విలీన బిల్లుకు ఆమోదం తెలిపారు.
సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి - బండి సంజయ్
ఆర్టీసి కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లుకు గౌరవ గవర్నర్ఆ మోదం తెలపడం హర్షణీయమన్నారు ఎంపీ బండి సంజయ్. “గవర్నర్ తమిళిసై గారు కార్మికుల పక్షపాతి. వాళ్లకు భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే ఆ బిల్లును పూర్తిగా అధ్యయనం చేసి అందులోని లోపాలను ఎత్తి చూపారు. ఇది జీర్ణించుకోలేని కేసీఆర్, గవర్నర్ కు లేనిపోని దురుద్దేశాలు ఆపాదిస్తూ కించపర్చే కుట్రకు తెరలేపారు. ఆర్టీసీ కార్మికుల్లో లేనిపోని అపోహలు సృష్టించారు. అయినప్పటికీ గవర్నర్ గారు వెరవలేదు. ఓట్ల కోసం తూతూ మంత్రంగా బిల్లును రూపొందించి, ఎన్నికలయ్యాక కార్మికులను రోడ్డున పడేయాలనుకున్న కేసీఆర్ కుట్రను అడ్డుకుని బిల్లులోని లోపాలను సరిదిద్దేలా చేసిన గవర్నర్ గారికి ఆర్టీసీ కార్మికుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు చెబుతున్నాను. తక్షణమే ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభించాలి. ఈ విషయంలో కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి” అని సవాల్ విసిరారు.