TSRTC : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు?
TSRTC : మహాలక్ష్మి పథకంలో భాగంగా టీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. టికెట్ తీసుకుని నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని పురుషులు అంటున్నారు. దీంతో బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుందని సమాచారం.
TSRTC : తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటీవలే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ కారణంగా పురుషులకు సీట్లు కాదు కదా నిలబడటానికి కూడా చోటు లేకుండా పోయింది. దూర ప్రాంతాలకు కూడా పురుషులు గంటల తరబడి నిలబడే ప్రయాణం చేస్తున్నారు.
55 సీట్లలో 20 సీట్లు పురుషులకు?
దీంతో కొందరు పురుషులు ఆర్టీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీపై ఒత్తిడి పెరిగింది. టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు బస్సులో ఈ సీట్లు మహిళలకు మాత్రమే అని రిజర్వ్ చేసినట్లు ఇప్పుడు పురుషులకు కూడా అదే తరహాలో రిజర్వ్ చేసే ఆలోచన చేస్తుందట తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. కాగా పురుషులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఆర్టీసీ అధికారులు పడ్డారట. ఇందుకోసం బస్సులో ఉండే 55 సీట్లలో కనీసం 20 సీట్లను పురుషులకు ప్రత్యేకంగా కేటాయించేలా అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని డిపోల నుంచి మ్యానేజర్ల నుంచి ఉన్నతాధికారులు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మరోవైపు పురుషులకు సీట్లు కేటాయిస్తే వ్యతిరేకత వస్తుందా? అని ఆలోచిస్తున్నారట.
బస్సుల సంఖ్య పెంపు
ఎందుకనగా దేశంలో సీనియర్ సిటిజెన్లు, వికలాంగులు,మహిళలకు తప్ప పురుషులకు బస్సులో సీట్లను రిజర్వ్ చేసిన దాఖలాలు లేవు. మరోవైపు టికెట్ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ పురుషులు బస్సులో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు పురుషులకు సీట్ల కేటాయింపు విధానాన్ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే రద్దీ పెరగడంతో బస్సుల సంఖ్య పెంచుతున్నామని ఇటీవల ఆ సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా