తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group -1 Exam: గ్రూప్‌-1 ప్రిలిమ్స్ లో 5 ప్రశ్నలు తొలగింపు

TSPSC Group -1 Exam: గ్రూప్‌-1 ప్రిలిమ్స్ లో 5 ప్రశ్నలు తొలగింపు

HT Telugu Desk HT Telugu

16 November 2022, 8:19 IST

google News
    • Group -1 Exam Key: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో ఐదు ప్రశ్నలను  తొలగించింది టీఎస్‌పీఎస్సీ. ఈ మేరకు ఆయా ప్రశ్నల వివరాలను పేర్కొంది. 
తెలంగాణ గ్రూప్ 1
తెలంగాణ గ్రూప్ 1

తెలంగాణ గ్రూప్ 1

Telangana Group -1 Exam Key 2022: గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలో వచ్చిన అభ్యంతరాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు ప్రశ్నలను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. మొత్తం 150 ప్రశ్నల్లో 145 ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకుంది. మంగళవారమిక్కడ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 తుది కీ ప్రకటించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాల నేపథ్యంలో సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

అక్టోబరు 16న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరగగా.... ప్రాథమిక కీనిఅక్టోబరు 29న విడుదలైంది. అదేనెల 30 నుంచి నవంబరు 4 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. ఈ ప్రిలిమినరీ కీపై అభ్యర్థుల నుంచి పలు అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సబ్జెక్టు నిపుణుల కమిటీలకు కమిషన్‌ సిఫార్సు చేసింది. ఈ కమిటీ అభ్యంతరాలను క్షుణ్నంగా పరిశీలించి.. 5 ప్రశ్నలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తర్వాత తుది ‘కీ’ ప్రకటించింది.

5 ప్రశ్నలు ఇవే…

గ్రూప్‌-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రంలో 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది. 107వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్‌ 1 లేదా 2 లేదా 3 లేదా 4లో ఏది పేర్కొన్నా ఒక మార్కు ఇవ్వనున్నట్లు కమిషన్‌ స్పష్టం చేసింది. అలాగే 133వ ప్రశ్నకు ఒకటి లేదా రెండు ఈ రెండింటిలో ఏ ఆప్షన్‌ గుర్తించినా మార్కు కేటాయించనుంది. 57వ ప్రశ్నకు సమాధానాన్ని ఆప్షన్‌ ఒకటిగా సవరించింది. ఆ ప్రకారం గ్రూప్‌ 1 పరీక్షలో మొత్తం 150 మార్కులకు 5 ప్రశ్నలను తొలగించినందున 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను 150 మార్కులకు దామాషా పద్ధతిలో తుది మార్కులను లెక్కించింది.

ఓఎమ్‌ఆర్‌ పత్రాలను ఈనెల 29 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది దరఖాస్తు చేసుకోగా 2,86,031 మంది పరీక్ష(Exam) రాశారు. 150 మార్కులకు నిర్వహించిన పరీక్షలో 150 ప్రశ్నలు ఇచ్చారు. ప్రిలిమినరీ(Preiliminary)లో అర్హత సాధించే అభ్యర్థులు మెయిన్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక పోస్టుకు 50 మంది చొప్పున (1:50 నిష్పత్తి ప్రకారం) మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దీనిలో కటాఫ్‌ మార్కుల పద్ధతి లేదని పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. మెరిట్‌ జాబితా(Merit List) ప్రకారం మెయిన్‌కు ఎంపిక చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెయిన్‌ పరీక్ష(Group 1 Main Exam) నిర్వహించే అవకాశం ఉంది.

గ్రూప్‌ –1 పోస్టులు - వివరాలు

ఎంపీడీవో- 121

జిల్లా బీసీ అభివద్ధి అధికారి– 2

అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌– 40

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌– 38

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(వైద్యారోగ్యశాఖ)– 20

డీఎస్పీ– 91

జైల్స్‌ డిప్యూటీ సూపరిండెంట్‌– 2

అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌– 8

డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌– 2

జిల్లా మైనారీటీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌– 6

మునిసిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ (2) - 35

డీపీవో- 5

కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌- 48

డిప్యూటీ కలెక్టర్‌- 42

అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌- 26

జిల్లా రిజిస్ట్రార్‌- 5

జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌- 3

ఆర్టీవో- 4

జిల్లా గిరిజన సంక్షేమాధికారి- 2

తదుపరి వ్యాసం