TSPSC | గ్రూప్-1 అభ్యర్థులకు గమనిక.. పాఠ్యాంశాల్లో మార్పులు.. చూసుకున్నారా?
తెలంగాణలో కొలువుల జాతరతో అభ్యర్థులంతా ప్రిపేరేషన్ మీద పడ్డారు. మరోవైపు గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తులు భారీగానే వస్తున్నాయి. అయితే పాఠ్యాంశాల్లో స్వల్ప మార్పులు జరిగాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత.. వచ్చిన తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద అభ్యర్థులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఎలా చదవాలి, ఏం చదవాలి అనే దానిపై దృష్టి పెట్టారు. గ్రూప్ 1 పాఠ్యంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్వల్ప మార్పులు చేశారు. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలు చేర్చారు. తెలంగాణ జాగ్రఫీ పుస్తకం అందుబాటులో ఉంది. అయితే ఎకానమీ పుస్తకం పదిరోజుల్లో ప్రింటింగ్ పూర్తి అవుతుంది.
రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత.. ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. దీంతో.. జిల్లాల భౌగోళిక స్వరూపం మారిపోయిన విషయం తెలిసిందే. పెద్ద జిల్లా, చిన్న జిల్లా, అక్షరాస్యత రేటు, లింగ నిష్పత్తితోపాటుగా మరిన్ని అంశాలు జాగ్రఫీలో చేర్చారు.
ఎకానమీ సబ్జెక్టు బడ్జెట్ కూడా పాఠ్యంశాల్లో చేర్చారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ వివరాలను ఎకానమీ పుస్తకాల్లో చేర్చినట్టుగా తెలుస్తోంది. జీఎస్డీపీ, తలసరి ఆదాయం గణాంకాలు, సెక్టోరల్ ట్రెండ్స్, సర్వీస్ సెక్టార్ ట్రెండ్స్, పరిశ్రమలకు సంబంధించిన అంశాలు.. ఆర్థిక సర్వే, కాగ్ నివేదికలు పాఠ్యంశాల్లో చేర్చారు.
గ్రూప్ 1 పోస్టులకు మే 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 64,738 మంది దరఖాస్తు చేసుకున్నారు. 94,765 మంది కొత్తగా ఓటీఆర్ నమోదు చేయించుకున్నారు. ఓటీఆర్ నమోదు, ఎడిట్ చేసిన వారు మెుత్తం 2,95,421 మంది ఉన్నారు. గతంలో ఓటీఆర్ చేసుకున్న వాళ్లు కూడా.. కొత్తగా వచ్చిన జోనల్ వ్యవస్థ ప్రకారం ఓటీఆర్ అప్‌డేట్ చేసుకోవాలి.