Delhi Liquor Scam: నాకు ఎలాంటి నోటీసులు రాలేదు - ఎమ్మెల్సీ కవిత
16 September 2022, 17:03 IST
- TRS MLC Kavitha Tweet: ఢిల్లీ లిక్కల్ కుంభకోణం కేసులో తనకి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫొటో)
TRS MLC Kavitha Tweet On ED Notices: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుచోట్ల సోదాలు జరిపిన దర్యాప్తు సంస్థ... శుక్రవారం కూడా హైదరాబాద్ లో దాడులు చేపట్టింది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారనే వార్తలు బయటికి వచ్చాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు ఎమ్మెల్సీ కవిత. తనకి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు.
'ఢిల్లీలో కూర్చొని ఉన్న కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాను తప్పదోవ పట్టిస్తున్నారు. వాస్తవాలను చూపించడానికి సమయం వెచ్చించాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను.మీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేయడానికి, నేను స్పష్టత ఇవ్వదల్చుకుంది ఏమిటంటే, నాకు ఎటువంటి నోటీసు రాలేదు' అంటూ కవిత తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో సోదాలు..?
ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. ఆయన గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత వద్ద ఆడిటర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
40 ప్రాంతాల్లో సోదాలు...
delhi liquor scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం పలు రాష్ట్రాల్లోని 40 ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించిందని అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయ ప్రతిష్టంభనకు మద్యం పాలసీ కేసు కేంద్రంగా మారింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి పుట్టిందని గొప్పగా చెప్పుకునే ఆప్‌పై ప్రత్యర్థి పార్టీలు మనీలాండరింగ్ ఆరోపణలు చేశాయి. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గతంలో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఆయన సూచన మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ పెద్దఎత్తున సోదాలు చేపట్టింది.
దర్యాప్తు సంస్థల రాడార్‌లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆప్ పదే పదే ఆరోపిస్తోంది.
ఢిల్లీతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుపుతోంది. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరులోని పలు ప్రదేశాల్లో సోదాలు జరుపుతోంది. బెంగళూరు, చెన్నైలో కూడా సోదాలు చేపడుతోంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇదివరకే ఒకసారి ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ చేసిన ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు సాగుతోంది.
హైదరాబాద్‌లో ఇదివరకు అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ప్రేమ్ సాగర్ రావు, అభిషేక్ తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. వీరంతా రాబిన్ డిస్టిలరీ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. ఇటీవలి సోదాల్లో వెలుగు చూసిన సమాచారం ఆధారగా శుక్రవారం మరికొన్ని చోట్ల సోదాలు జరుపుతున్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎక్సైజ్ పాలసీలో పెద్ద ఎత్తున చేతులు మారాయని, ఇందులో ఏపీ, తెలంగాణకు సంబంధించిన కంపెనీలు, ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.