Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ 'స్కామ్'లో బడా నేతల పేర్లను బయటపెట్టిన నిందితుడు!
06 September 2022, 11:13 IST
Delhi liquor scam Sunny Marwah : ఢల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా.. వేగంగా అడుగులు వేస్తోంది సీబీఐ. తాజాగా ఓ నిందితుడిని విచారించింది. అతను పలు కీలక విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తోంది!
లిక్కర్ స్కామ్‌పై ఢిల్లీలో బీజేపీ నిరసనలు
Delhi liquor scam Sunny Marwah : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు సన్నీ మర్వాను విచారించిన సీబీఐ.. కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి.. ఎఫ్ఐఆర్లో ఉన్న పలువురిపై సంచలన విషయాలను సన్నీ మర్వా బయటపెట్టినట్టు సమాచారం. ఈ మేరకు సీబీఐ అధికారులు.. సోమవారం సన్నీ మర్వా స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు.
సన్నీ మర్వా విచారణకు కొన్ని గంటల ముందు.. అతని తండ్రి కుల్విందర్ మర్వాకు సంబంధించిన ఓ వీడియోను ‘స్టింగ్ ఆపరేషన్’ పేరుతో సోమవారం విడుదల చేసింది బీజేపీ. లిక్కర్ లైసెన్సుల కోసం కమీషన్లు చెల్లించినట్టు కుల్విందర్ చెప్పారని బీజేపీ ఆరోపించింది. తాము చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో అసలు నిజాలు బయటపడ్డాయని పేర్కొంది.
"లాభాల్లో 80శాతం వాటా సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, వారి స్నేహితులకు వెళ్లే విధంగా ఒప్పందం జరిగింది. మిగిలిన 20శాతంతో ఏదైనా చేసుకోవచ్చని నేతలు చెప్పారు," అంటూ బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపణలు చేశారు.
Delhi liquor scam news : కాగా.. తండ్రి కుల్విందర్‌కు చెందిన వీడియో వ్యవహారం.. సన్నీ మర్వా విచారణలో ప్రస్తావించింది సీబీఐ. ఈ క్రమంలోనే పలు కీలక విషయాలను అతను బయటపెట్టినట్టు తెలుస్తోంది.
సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానాల ద్వారా మర్వా మహాదేవ్ లిక్కర్స్‌కు ఎల్-1 లైసెన్స్ లభించింది. కాగా.. మర్వాలు ఢిల్లీ ప్రభుత్వ అధికారులకు అత్యంత సన్నిహితులని, వారందరికి వీరు ముడుపులు చెల్లిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. ఇదే కేసులో.. ఇతర నిందితులను కూడా సీబీఐ విచారించింది. వారిలో.. మనీశ్ సిసోడియకు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందిన అమిత్ అరోరా కూడా ఉన్నారు.
సిబీఐ విచారణ, బీజేపీ ఆరోపణలపై మనీశ్ సిసోడియా స్పందించారు.
Delhi liquor scam Manish Sisodia : "ఎలాంటి స్కామ్ జరగలేదు. సీబీఐ నన్ను విచారించింది. నా బ్యాంకు లాకర్లను తనిఖీ చేసింది. ఏం లేదని చెప్పి.. నాకు క్లిన్ చిట్ ఇచ్చింది," అని మనీశ్ సిసోడియా అన్నారు.
అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాము ఇంకా ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని సీబీఐ చెబుతోంది. దర్యాప్తు వేగంగా జరుగుతోందని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెబుతోంది.