Revanth Reddy Challenge to KTR: భూకబ్జాలపై నేను విచారణకు సిద్ధం...నువ్వు సిద్ధమా కేటీఆర్..?
09 February 2023, 22:24 IST
- Revanth Reddy Fires On Minister KTR: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనపై చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని... ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలపై కూడా సిద్ధంగా ఉండాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Revanth Reddy Latest News: భూకబ్జాలు చేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై విచారణకు కూడా సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లంచ్ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... “భూమి తల్లితో సమానం. సాయుధ రైతాంగం పోరాటం, 1969లో తెలంగాణ ఉద్యమం భూముల కోసమే జరిగింది. ధరణి వ్యవస్థను తీసుకొచ్చి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లో నిజాం ముందు నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను కేటీఆర్ తో పాటు ఆయన మిత్రబృందం కొట్టేసింది" అని ఆరోపించారు. వారి మాట వినే కలెక్టర్ల ద్వారా భూ దోపిడికి పాల్పడ్డారని ఆరోపించారు.
"నేను భూదందాలకు పాల్పుడుతున్నా అని కేటీఆర్ ఆరోపణ చేశారు. నాపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం. అదేవిధంగా 2014 నుంచి ఇప్పటి వరకు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లో జరిగిన భూ లావాదేవీలపై, 2004-14 వరకు నిషేధిత జాబితాలో చేర్చిన భూముల్లో ఎన్నివేల ఎకరాల భూములను ఆ జాబితా నుంచి తొలగించారు..? ఎవరెవరి పేర్ల మీద బదలాయించారు..? అనేది సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలి అని కేటీఆర్ కు సవాలు విసురుతున్నా. అమెరికన్ కంపెనీని బెదిరించి తెల్లపూర్ లోని 100 ఎకరాల రూ. 5 వేల కోట్ల విలువైన భూములను రూ.260 కోట్లకే ప్రతిమ శ్రీనివాస్ పేరిట బదలాయించారు. అందులో వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అందులో కేటీఆర్ కు భాగస్వామ్యం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఆంధ్రా నేత తోట చంద్రశేఖర్ కు మియాపూర్ లో ఎకరాం 100 కోట్లు ఉండే 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టింది. మియాపూర్లో సర్వే నెంబర్ 80లో రూ. 500 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి ఏవిధంగా వచ్చింది. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమి బదిలీ కోసమే రెడ్యా నాయక్ ను పార్టీ మార్పించింది వారి కూతురు కవిత. కూతురు భూ దాహం కోసమే రెడ్యా నాయక్ పార్టీ మారారు. కవిత ఈ విషయంపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నాను" అని చెప్పారు
కొడుకు చేసే భూ దందాలు కనిపించడం లేదా? అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గడీల పాలనకు వ్యతిరేకమన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తామని చెప్పారు. రాబోయే 10 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని... అక్రమాలకు పాల్పడిన సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్ లను జైలుకు పంపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాక్షస పాలన అందిస్తూ, దోపిడీలు చేస్తున్న కేసీఆర్ ను పాతాళానికి తొక్కేందుకే ఈ యాత్ర చేస్తున్నామని చెప్పారు.