Revanth Reddy : మేడారంలో తొలి అడుగు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే... రేవంత్ రెడ్డి-tpcc president revanth reddy slams kcr government in first corner meeting during padayatra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tpcc President Revanth Reddy Slams Kcr Government In First Corner Meeting During Padayatra

Revanth Reddy : మేడారంలో తొలి అడుగు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే... రేవంత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Feb 06, 2023 08:11 PM IST

Revanth Reddy : మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి... తొలి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మేడారంలో పడ్డ తొలి అడుగు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే అని ధ్వజమెత్తారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేసీఆర్ సర్కార్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అమరుల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. వారి త్యాగాలకు మట్టికప్పాలని చూస్తోందని విమర్శించారు. తెలంగాణ కోసం అమరుల ఆత్మ ఘోష ఇంకా వినిపిస్తోందని భావోద్వేగంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తుంటే.. బొందపెట్టిన రాచరికం మళ్లీ పుట్టినట్లు అనిపిస్తోందని ధ్వజమెత్తారు. ములుగు జిల్లా మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను ప్రారంభించిన రేవంత్... పస్రా వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మేడారంలో పడ్డ తొలి అడుగు పాదయాత్ర కోసం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే అని రేవంత్ నినదించారు.

"రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని గొప్పగా అమలు చేస్తున్నామని బూటకపు మాటలు చెబుతోంది. అప్పుల బాధతో రైతులు పురుగుల మందు తాగి చనిపోవడం సంక్షేమమా ? ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా తొమ్మిదేళ్లు ప్రభుత్వం కాలయాపన చేసింది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షేమమా ? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా పేదలను విద్యకు దూరం చేయడం సంక్షేమమా ? డబుల్ బెడ్రూం ఇళ్లు ఎవరికైనా వచ్చాయా ? రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా ? 25 లక్షల కోట్లు ఎటు పోయాయి ? ఆ సొమ్ము రాబందుల సమితి దోచుకుంది వాస్తవం కాదా ? తెలంగాణలో 10 శాతం ఉన్న పెట్టుబడి దారులకు మాత్రమే కేసీఆర్ లాభం చేకూర్చారు. తెలంగాణను బొందలగడ్డగా మార్చింది కేసీఆర్ కాదా ? రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, బలహీన వర్గాల జీవితాల్లో మార్పు కోసమే ఈ యాత్ర. రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ అధికారం పోవాలి. కేసీఆర్ ను గద్దె దింపితేనే రాష్ట్రంలో మార్పు వస్తుంది" అని రేవంత్ అన్నారు.

కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. త్యాగాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని.. అందుకే ప్రాణాలకు తెగించి దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని అన్నారు. రాహుల్ సందేశం స్ఫూర్తిగా హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించిందని.. రాష్ట్రంలో మేడారం నుంచే ఈ యాత్ర మొదలు పెట్టడానికి ఓ కారణం ఉందని చెప్పారు. వనదేవతలు సమ్మక్క -సారలమ్మలు నమ్మిన ప్రజల కోసం రాచరికాన్ని ఎదిరించి చివరి రక్తపు బొట్టు వరకు పోరాడారని... అందుకే ఆ అమ్మల ఆశీర్వాదంతో పోరాటానికి సిద్ధమయ్యామని వివరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ తో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారన్న రేవంత్... సమ్మక్క సారక్క సాక్షిగా సీతక్క హారతి ఇచ్చి స్వాగతం పలికిందంటే.. ఈ యాత్ర విజయవంతం అయినట్లేనని వ్యాఖ్యానించారు.

ఒక్క పిలుపుతో ఇంత మంది తరలిరావడం చూస్తుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఎంత ఉత్సహంతో ఉన్నారో అర్థం అవుతోందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. వనదేవతల ఆలయం నుంచి సోదరుడు రేవంత్ రెడ్డి యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. తాను పేదింటి బిడ్డనైనా.. అంతా అక్కున చేర్చుకున్నారని... మూడు తరాలతో అక్కా అని అప్యాయంగా పిలిపించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే వరకు చేతిలో చేయి వేసి.. అడుగులో అడుగేయాలని సీతక్క పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిసి పోడు భూములకు పట్టాలు ఇస్తామని రాత్రికి రాత్రి చాటింపు వేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన పార్టీ అని.. పేదలకు బతుకుదెరువు ఇచ్చిన కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావిద్, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, బలరాం నాయక్, మల్లు రవి తదితరులు సభలో పాల్గొన్నారు.

IPL_Entry_Point