TSPSC Hall Tickets: నేటి నుంచి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్‌టికెట్లు.. డౌన్లోడ్ లింక్ ఇదే
10 March 2023, 10:30 IST
- TSPSC Veterinary Assistant Surgeon Exam: పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టికెట్లు శుక్రవారం విడుదల కానున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాట్ టికెట్లు
Veterinary Assistant Surgeon Exam Hall Tickets 2023: తెలంగాణలో ఉద్యోగాల ప్రక్రియ వేగంగా నడుస్తోంది. ఇప్పటికే పలు పరీక్ష తేదీలను ప్రకటించగా... మరోవైపు ఆప్లికేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఇంకొన్ని ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ మధ్యనే గ్రూప్ 2 పరీక్ష తేదీ రాగా... తాజాగా మరో ఉద్యోగ నియామక పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు గురువారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టికెట్లు శుక్రవారం(మార్చి 10వ తేదీ) విడుదల కానున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు టీఎస్‌పీస్సీ వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 15వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మార్చి 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్-ఎ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్-బి కేటగిరీ పోస్టుల భర్తీకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ కామన్‌గా ఉంటుందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో క్లాస్-ఎ విభాగంలో 170 పోస్టులు, క్లాస్-బి విభాగంలో 15 పోస్టులు ఉన్నాయి. మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (వెటర్నరీ సైన్స్-డిగ్రీ స్థాయి), 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నలకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లీష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.