TSPSC Group 2 Exam Date : అలర్ట్.. ఆగస్టు 29, 30న గ్రూప్ - 2 పరీక్షలు
TSPSC Group 2 Exam Date : ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ - 2 పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. వారం రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. గ్రూప్ - 1 మెయిన్స్.. గ్రూప్ - 4 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే.
TSPSC Group 2 Exam Date : గ్రూప్ - 2 పరీక్షల తేదీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commision) ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ - 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలకు వారం ముందు హాల్ టికెట్లు డౌన్ లోడు చేసుకోవచ్చని వెల్లడించింది. మొత్తం నాలుగు పేపర్లకు గాను... ఆగస్టు 29న ఫస్ట్, సెకండ్ పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 30న మూడు, నాలుగో పేపర్ కు ఎగ్జామ్ జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనుంది టీఎస్పీఎస్సీ.
గ్రూప్ - 1 మెయిన్స్.. గ్రూప్ - 4 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే. జూన్ 5న గ్రూప్ - 1 మెయిన్స్ నిర్వహించనుంది. దాదాపు 9 లక్షల మంది దరఖాస్తు చేసిన గ్రూపు - 4 పరీక్షను జూలై 1న జరపనుంది. ఈ పరీక్షలకు కూడా వారం ముందు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం.. విద్యార్థులు అన్ని పరీక్షలకు హాజరయ్యేలా తేదీలను ఖరారు చేస్తోంది. ఇతర శాఖల్లోనూ నియామకాలు కొనసాగుతున్నందున... ఆయా నియామక బోర్డులతో సమన్వయం చేసుకుంటూ ఎగ్జామ్స్ డేట్స్ ప్రకటిస్తోంది. త్వరలోనే గ్రూప్ 3 డేట్స్ కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.
గ్రూప్ 2 ఉద్యోగాలకు ఫిబ్రవరి 16వ తేదీతో గడువు ముగియగా... మొత్తం 783 పోస్టులకు 5,51,943 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భాగంగా వచ్చిన దరఖాస్తులను పోల్చితే... ఒక్కో పోస్టుకు 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.
4 పేపర్లు...
గ్రూప్ 2 పరీక్షను మొత్తం 600 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 150 మల్టిపుల్ ఛాయిల్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్ పరీక్ష కాల పరిమితి రెండున్నర గంటలు ఉంటుంది. పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, పేపర్-2లో చరిత్ర, పాలిటీ, సొసైటీ, పేపర్-3లో ఎకానమీ, డెవలప్‌మెంట్, పేపర్-4లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుపై ప్రశ్నలుంటాయి. గతంలో మాదిరిగా ఇంటర్వూలు లేవు.
సిలబస్ లో మార్పులు..
మొత్తం నాలుగు పేపర్లలో పేపర్ 2 లో స్వల్ప మార్పులు ఉన్నాయి. ఇక పేపర్3లో చాలా మార్పులే చేశారు. పేపర్1, 4 లో ఎలాంటి మార్పులు లేవు. పేపర్-2లోని పార్టు-2లో గతంలో ఉన్న ‘భారత రాజ్యాంగం - కొత్త సవాళ్లు’... ‘భారత రాజ్యాంగం - సవరణల విధానం, సవరణ చట్టాలు’గా మారింది. ‘దేశంలో న్యాయవ్యవస్థ’ సబ్జెక్టులో జ్యుడీషియల్ రివ్యూ, సుప్రీంకోర్టు, హైకోర్టు అంశాలు అదనంగా వచ్చాయి. ప్రత్యేక రాజ్యాంగ నియమావళిలో మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు... జాతీయ కమిషన్లలో మహిళా, మైనార్టీ, మానవ హక్కులను చేర్చారు. జాతీయ సమైక్యత, సవాళ్లు, అంతర్గత భద్రత, అంతర్రాష్ట్ర సవాళ్లు సబ్జెక్టుగా వచ్చాయి. పేపర్-3లోనూ ఒక్కోపార్టులో పలు అంశాలను సిలబస్‌లోకి చేర్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను చూడొచ్చు.