తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy District : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు యువకులు దుర్మరణం

Sangareddy District : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు యువకులు దుర్మరణం

HT Telugu Desk HT Telugu

25 July 2024, 19:42 IST

google News
    • Road Accident in Sangareddy : సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.
సంగారెడ్డిలో ఘోర ప్రమాదం
సంగారెడ్డిలో ఘోర ప్రమాదం

సంగారెడ్డిలో ఘోర ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై టాటా అల్ట్రా డీసీఎం లారీని వెనుక నుంచి అతి వేగంగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన కంది మండలం తునికిళ్ళ తండా వద్ద ఉదయం చోటు చేసుకుంది.

తెల్లవారుజామునే నిద్రలేచి విధులకు వెళ్ళొస్తామని ఇంట్లో చెప్పి ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. అంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృతువు వారిని కబళించింది. అప్పుడే వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిన తమ పిల్లల మరణ వార్త విన్న కుటుంబసభ్యుల తీవ్ర శోకంలో మునిగిపోయారు. వీరి మరణంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కిచెన్ లో కార్మికులుగా ........

వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసాజి పేట,గంగోజి పేట గ్రామాలకు చెందిన అభిషేక్, సందీప్, నవీన్ అనే ముగ్గురు యువకులు కందిలోని అక్షయ పాత్ర కిచెన్ లో కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు గురువారం తెల్లవారుజామున ముగ్గురు కలిసి ఒకే బైక్ పై కందికి విధులకు బయల్దేరారు. మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ఆగి ఉన్న టాటా అల్ట్రా డీసీఎం లారీని వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విద్యుదాఘాతంతో కూలీ మృతి .......

వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ కూలీ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని పర్వతాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మధిర బాపనయ్య తండాకు చెందిన కట్రోతు లక్ష్మా (46) కు భార్య,ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నాడు. అతడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

కాగా బుధవారం సమీపంలోని పన్యా తండాకు వ్యవసాయ కూలీ పనులకు వెళ్ళాడు. అక్కడ గట్టు మీద నుండి నడుతుండగా బోర్ మోటర్ విద్యుత్ తీగ లక్ష్మా చేతికి తగిలింది. దీంతో విద్యుత్ షాక్ కు గురై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టుపక్కల పొలాల్లో ఉన్న వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భర్త మృతి చెందడంతో భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య బుజ్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సైబర్ మోసాలు… రూ. 2 కోట్లు పొగొట్టుకున్న బాధితులు

ఉమ్మడి మెదక్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నాయి. ఒకేరోజు సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకొని ముగ్గురు వ్యక్తులు రూ. 2 కోట్లకుపైగా పోగొట్టుకున్నారు.

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాడు చెప్పిన మాయ మాటలు నమ్మిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఏకంగా రూ. కోటి పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో చోటుచేసుకుంది.

పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ గ్రాండియో గేటెడ్ కమ్యూనిటీలో ఉండే బెజవాడ నాగార్జున (36) బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. కాగా నాగార్జునకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని వాట్సాప్ ద్వారా నాడియ కామి అనే మహిళ జులై 5న మెసేజ్ పంపించింది.

పెట్టుబడులు పెట్టాల్సిన సంస్థలను తాము సూచిస్తామని,లాభాలు తెచ్చిపెట్టే బాధ్యత తమదని నమ్మించింది. దీంతో అది నమ్మిన నాగార్జున వాట్సాప్ లింక్ ద్వారా ఇన్వెస్ట్ మెంట్ లింక్ ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాడు.

మొత్తం ఇప్పటివరకు విడతల వారీగా రూ.99,78,526.70 (సుమారు కోటి రూపాయలు ) పెట్టుబడులు పెట్టాడు. అయితే వచ్చిన లాభాలు తమ బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడాన్ని గమనించిన వ్యక్తి తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే బాధితుడు సోమవారం అర్ధరాత్రి పటాన్చెరు పోలీసులని ఆశ్రయించాడు. తక్షణమే స్పందించిన పటాన్చెరు పోలీసులు 1930 కి కాల్ చేసి ఫ్రాడ్ స్టార్స్ అకౌంట్ లలో రూ. 24 లక్షలు ఫ్రిజ్ చేసినట్లు పటాన్చెరు సీఐ తెలిపారు.

అమీన్ పూర్ మరో వ్యక్తి ....

నకిలీ ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట ఓ ప్రైవేట్ ఉద్యోగి రూ. 98 లక్షలు పెట్టుబడులు పెట్టి నష్టపోయిన ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అమీన్ పూర్ ఏఆర్ బృందావన్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ఆన్ లైన్ ట్రేడింగ్ కి సంబంధించిన మెసేజ్ వచ్చింది. అతడు ఆ లింక్ ను ఓపెన్ చేసి తన వివరాలను నమోదు చేశాడు. దీంతో సైబర్ నేరస్థుడు ఐడిని క్రియేట్ చేసి ఇచ్చాడు.

ముందుగా బాధితుడు రూ. లక్ష ఇన్వెస్ట్ చేయగా… రూ. 3 లక్షలు లాభాలు చూపించాడు. ఇది నమ్మిన బాధితుడు పలు దఫాలుగా స్నేహితుల వద్ద నుంచి తీసుకొని.. బంగారం అమ్మి మొత్తం రూ. 98. 40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీంతో తాను పెట్టిన నగదుతో పాటు వచ్చిన లాభాలు ఇవ్వాలని అడగగా అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వ్యక్తి వెంటనే సీబీర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసాడు. అనంతరం సోమవారం రాత్రి అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు.

మెదక్ జిల్లాలో మరో కేసు….

మెదక్ జిల్లాలో మరో సైబర్ కేసు నమోదైంది. రూ. 5 లక్షలు కాజేసిన ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం….. తుఫ్రాన్ పట్టణంలో నివాసం ఉండే ఓ యువతికి సైబర్ నేరగాళ్ల నుంచి సోమవారం కాల్ వచ్చింది.

ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇంటర్నేషనల్ కొరియర్ వచ్చిందని చెప్పారు. దీంతో ఆ యువతీ తాను ఎలాంటి కొరియర్ బుక్ చేయలేదని చెప్పింది. వెంటనే సైబర్ నేరగాడు కొరియర్ మీది కాకపోతే… క్యాన్సిల్ చేయడానికి 1 నొక్కమని చెప్పాడు. దీంతో ఆమె ఒకటి నొక్కింది. దీంతో స్కైప్ వీడియో కాల్ లో ఐసీఐసీఐ బ్యాంకు వెరిఫికేషన్ అంటూ ఆమె సమాచారాన్ని వివరించారు. అవి తమ వివరాలే అని బాధితురాలు పేర్కొంది.

వెంటనే మీ ఖాతాలో రూ. 6 లక్షలు వచ్చాయని చెక్ చేసుకోమని చెప్పారు. యాప్ ఓపెన్ చేసి చూసే లోపే రూ. 6 లక్షలు లోన్ తీసి… అందులో నుండి రూ. 5 లక్షలు కాజేసినట్లు గుర్తించింది. వెంటనే 1930కు కాల్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.

తదుపరి వ్యాసం