Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం- విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్, ఒకరు మృతి 13 మందికి గాయాలు
Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బుధవారం చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం గొట్టిగంటివారిపల్లె సమీపంలో జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ తీగలు కూలీలుపై తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు చనిపోగా, 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఐదురుగు పరిస్థితి చాలా విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
కూలీలంతా ఒడిశా, బీహార్‌కు చెందిన వారు. వీరంతా ఒంగోలుకు చెందిన ఏవీఆర్ సంస్థలో గత కొంత కాలంగా పనిచేస్తున్నారు. గొట్టిగంటివారి పల్లె వద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ లైన్ కట్ చేశారు. క్షతగాత్రులను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాం కూడా పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఆరు నెలల క్రితమే ప్రేమ పెళ్లి...అంతలోనే అనుమానాస్పద మృతి
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆరు నెలల క్రితమే ప్రేమ పెళ్లి చేకున్న యువతి, అంతలోనే అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె బాబు కాలనీ వెంకటేశ్వరపురంలో చోటుచేసుకుంది. వెంకటేశ్వరపురంలో ఉంటున్న శ్రీనివాసులు, ఉష దంపతుల కుమారుడు మణికంఠ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రామ్‌నగర్‌కు చెందిన వెంకటరమణ, లక్ష్మిదేవీల కుమార్తె సాయి ప్రియ (20)లు ప్రేమించుకున్నారు. ఇద్దరు ఆరు నెలల క్రితమే ప్రేమ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లైన కొద్ది రోజుల నుంచే సాయిప్రియ, మణికంఠ మధ్య తరచూ గొడవులు జరుగుతుండేవి. ఈ గొడవల్లో మణికంఠ చేయి కూడా చేసుకునేవాడని తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు సాయి ప్రియ..మణికంఠ వేధింపులు భరించేదని ఆమె బంధువులు అంటున్నారు. ఆరు నెలల నిరంతరం దుఃఖంతోనే బతికిందన్నారు. అయితే మంగళవారం అర్ధరాత్రి భర్తతో సాయిప్రియకు మళ్లీ తగాదా అవ్వడం, భర్త కొట్టడంతో మనస్థాపనకు గురైంది. అయితే అర్ధరాత్రి వేళ ఆమె మరణించింది.
భర్త కొట్టడంతోనే సాయి ప్రియ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని, మృతదేహం మెడకు చీర చుట్టారని సాయిప్రియ బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం తెలుసుకున్న మదనపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం