BRS vs Congress : కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ.. అసలు ఏం జరిగింది? ముఖ్యమైన 10 అంశాలు ఇవే
12 September 2024, 16:49 IST
- BRS vs Congress : తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. అందుకు కారణమయ్యారు ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇద్దరు నేతల మధ్య జరిగిన డైలాగ్ వార్.. ఇప్పుడు రెండు పార్టీల మధ్య యుద్ధంగా మారింది. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అసలు వివాదానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది.
కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత
అరికపూడి గాంధీని ఇటీవల పీఏసీ ఛైర్మన్‌గా నియమించారు. దీనిపై బీఆర్ఎస్ భగ్గుమంది. పీఏసీ ఛైర్మన్ బాధ్యతలను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి ఇవ్వాలి కానీ.. కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పుకునే గాంధీకి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. దీనిపై తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్‌పై అరికపూడి గాంధీ ఘాటుగా స్పందించారు. ఆయన కూడా హద్దులు గాటి విమర్శలు చేశారు. ఇదే సమయంలో.. గాంధీ తన అనుచరులతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్న ఏరియాకు వెళ్లారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీ అనుచరులు కొందరు హల్ చల్ చేశారు. కౌశిక్ రెడ్డి నివాసంలో పలు వస్తువులను ధ్వంసం చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఇష్యూలో 10 కీలకాంశాలు..
1.అరికపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డి నివాసానికి వస్తున్నారని తెలిసి.. అరికేపూడి గాంధీని స్వాగతిస్తు మంగళహారతులు పట్టేందుకు బీఆర్ఎస్ మహిళా శ్రేణులు సిద్ధమయ్యారు. కౌశిక్ రెడ్డి తన ఇంటి సెక్యూరిటీకి ఫోన్ చేసి గాంధీని లోపలికి పంపాలని సూచించారు.
2.అరికేపూడి గాంధీ కోసం గులాబీ కండువాలతో సిద్దంగా ఉన్నానని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కాసేపటికే గాంధీ కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరకు చేరుకున్నారు. పోలీసులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధం చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి గేట్లు మూసేశారు.
3.కౌశిక్ రెడ్డి ఇంటి గేట్లు మూసేయడంతో.. గాంధీ అనుచరులు గోడెక్కి లోపలికి దూకి గేట్లు తెరిచారు. కొందరు లోపలికి వెళ్లి.. పూల కుండీలు ధ్వంసం చేశారు. రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేయగా.. కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయి. కౌశిక్ రెడ్డి మామకు గాయాలయ్యాయి.
4.ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఇంటివద్ద అరికపూడి గాంధీ మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో మళ్లీ అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. గాంధీని, ఆయన అనుచరులను అక్కడి నుంచి పంపించేశారు.
5.కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర జరిగిన ఘటనకు, కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదని.. టీపీసీసీ చీఫ్ మహేశ్ స్పష్టం చేశారు. ఆ ఘటన వారి వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు.
6.పాడి కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు.
7.కౌశిక్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి సీఎం రేవంత్ రెడ్డి చేయించిన దాడి అని.. హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ట్విట్టర్లో పెట్టి.. ఇవాళ పీఏసీ చైర్మన్ అవ్వగానే ప్రతిపక్షంలో ఉన్న అని మాట్లాడింది అరికేపూడి గాంధీ అని హరీశ్ రావు విమర్శించారు.
8.పాడి కౌశిక్ రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదు.. కౌశిక్ రెడ్డికి తల్లి, చెల్లి లేరా.. మహిళలు అంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు అని అరికేపూడి గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
9.పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ ఎపిసోడ్ నేపథ్యంలో.. తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. కొందరు గాంధీ అనుచరులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.
10.అరికపూడి గాంధీపై సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెళ్లారు. కౌశిక్ రెడ్డి వెంట మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి ఇతర బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. అటు పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.