Telangana Politics : అరికెపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి.. హద్దులు దాటిన డైలాగ్‌లు.. కౌశిక్ ఇంటిపై దాడి!
Telangana Politics : ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య డైలాగ్ వార్‌తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గాంధీ.. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్య కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హల్‌చల్ చేశారు. కౌశిక్ రెడ్డి బయటకు రావాలని డిమాండ్. చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి గేట్లను పోలీసులు మూసివేయడంతో.. గాంధీ అనుచరులు ప్రహరీ దూకి గేటు తెరిచారు. దీంతో కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అరికెపూడి గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి పంపించారు. ఇరువర్గాల కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
రాళ్లు, గుడ్లు, టమోటాలతో గాంధీ అనుచరుల దాడికి దిగారు. కౌశిక్‌రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. కౌశిక్‌రెడ్డి ఇంట్లో పూలకుండీలను గాంధీ అనుచరులు ధ్వంసం చేశారు. అక్కడున్న పోలీస్ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. మీడియా ప్రతినిధులపైనా గాంధీ అనచరులు దాడికి యత్నించారు. దీంతో కౌశిక్ రెడ్డి నివాసం దగ్గం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకుని.. సిద్దిపేట నుండి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరారు మాజీ మంత్రి హరీష్ రావు.
'కేసీఆర్ మాట్లాడితే సమాధానం చెబుతా. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్.. నాకే సవాల్ చేస్తాడా?. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించారు. అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను. కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు' శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు.
అరెకపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతా అని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. ఈ సవాల్‌ను స్వీకరించిన అరెకపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డి రాకపోతే తానే కౌశిక్ ఇంటికి వస్తా అంటూ ప్రతి సవాల్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఈ ఇద్దరు నేతల అనుచరులు పరస్పరం దాడులు చేసుకున్నారు.