Revanth Reddy House : సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం
15 September 2024, 15:39 IST
- Revanth Reddy House : సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం రేపింది. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్‌ను సెక్యూరిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆ బ్యాగ్ ఎవరు పెట్టారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్‌లో హైటెన్షన్ కొనసాగుతున్న సమయంలో ఈ బ్యాగ్ హాట్ టాపిక్‌గా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం సృష్టించింది. సమాచారం వచ్చిన వెంటనే సీఎం చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమాన్పద బ్యాగ్‌ను తరిలించి అధికారులు తనఖీ చేస్తున్నారు. ఆ బ్యాగ్‌లో ఏముంది.. అక్కడ ఎవరు పెట్టారనే కోణంలో సెక్యూరిటీ వింగ్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ వ్యవహారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీ అనుచరులు కౌశిక్ ఇంటిపైకి వెళ్లారు. ఈ వ్యవహారం కేసుల వరకూ వెళ్లింది. అటు బీఆర్ఎస్ నేతలు కూడా గాంధీ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో.. రేవంత్ ఇంటి సమీపంలో అనుమానాస్పద బ్యాగ్ సంచలనంగా మారింది.
అనుమానాస్పద బ్యాగ్ లభించడంతో.. సీఎం రేవంత్ ఇంటి వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు. ఆ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అటు వైపు వెళ్లే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి భద్రతకు సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం జనవరిలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన దగ్గర ఉన్న పోలీస్ భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చాలని నిర్ణయించింది. సీఎంకు సంబంధించి ప్రతీ సమాచారం లీక్ అవుతుందనే సెక్యూరిటీని మార్చినట్లు వార్తలు వచ్చాయి. గతంలో కేసీఆర్ వద్ద పని చేసిన కొందరు సిబ్బంది ఇప్పుడు రేవంత్ వద్ద ఉండగా.. వారిని మార్చాలని నిర్ణయించారు.
మాజీ సీఎం దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారిని, సిబ్బందిని సీఎం వద్ద పెట్టొద్దని సీఎంవోను ఐబీ ఆదేశించింది. సీఎం దావోస్ పర్యటన ముగిసిన అనంతరం భద్రతా సిబ్బంది మార్పు ప్రక్రియ జరిగింది. తన వ్యక్తిగత సమాచారం బయటకు వచ్చిందని ఇంటెలిజెన్స్ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సీఎం ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని మార్చారు.