Ganja Smuggling: అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్, 12 కిలోల గంజాయి స్వాధీనం.. హైదరాబాద్‌కు రవాణా-interstate ganja gang arrested 12 kg of ganja seized transported to hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganja Smuggling: అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్, 12 కిలోల గంజాయి స్వాధీనం.. హైదరాబాద్‌కు రవాణా

Ganja Smuggling: అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్, 12 కిలోల గంజాయి స్వాధీనం.. హైదరాబాద్‌కు రవాణా

HT Telugu Desk HT Telugu
Sep 11, 2024 07:11 AM IST

Ganja Smuggling: అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు జగిత్యాల జిల్లా పోలీసులు.‌ ఆరుగురు సభ్యులు గల ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 12 కిలోల గంజాయి, రెండు బైక్‌లు, 5 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హైదరాబాద్ కు సప్లై చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు
గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు

Ganja Smuggling: అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు జగిత్యాల జిల్లా పోలీసులు.‌ ఆరుగురు సభ్యులు గల ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 12 కిలోల గంజాయి, రెండు బైక్‌లు, 5 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన ఒకరు పరారీలో ఉండగా 4 కిలోల గంజాయి హైదరాబాద్ కు సప్లై అయినట్లు పోలీసులు ప్రకటించారు.

జగిత్యాల లో ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్టు అయిన వారిని చూపించి వివరాలు వెల్లడించారు. కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన ఎడమలపల్లి సాయికుమార్, తుడుం సాయితేజ, కందుల అరుణ్, గౌరాపూర్ గ్రామానికి చెందిన ఎడపెళ్ళి సాకేత్, ధరూర్ కు చెందిన పాల రాజుకుమార్, అఖిల్ గంజాయికి బానిసలై సులువుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ గ్రామాల్లో గంజాయి లభ్యమవుతున్నట్లు తెలిసుకుని అక్కడి వెళ్ళి గంజాయిని తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నారు.

బైక్ పై AOB గ్రామానికి....

ఐదుగురు ఒక్కొక్కరు రూ. 7 వేల చొప్పున అఖిల్ 10 వేల రూపాయలు జమ చేసి సెప్టెంబర్ 2న సాయికుమార్, తుడుం సాయితేజ బైక్‌పై AOB గ్రామానికి వెళ్లి, రూ.43,000/- చెల్లించి 16 కిలోల గంజాయిని సేకరించారు.‌ 3న పూడూర్ కు చేరుకుని గ్రామ శివార్లలోని పొదల్లో గంజాయి సంచులను దాచిపెట్టారు. అందులో 4 కిలోల గంజాయిని అఖిల్ హైదరాబాద్‌కు తీసుకెళ్ళాడు.

మిగతా గంజాయి 12 కిలోలు ఐదుగురు పంచుకోవడానికి పూడూరు లో సమావేశమయ్యారు. పూడూరు లో గంజాయి వినియోగంపై ఫిర్యాదుల నేపథ్యంలో నిఘా పెట్టగా ఐదుగురు పట్టుబడ్డారని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అందులో ఇద్దరు పాత నేరస్థులని నిషేద గంజాయి వినియోగించిన విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎక్కడైనా గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించిన వినియోగించినా వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తునట్లు తెలిపారు. పల్లెల్లో ర్యాలీలు, సదస్సులు నిర్వహించి డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘాతో అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.

ప్రచారం నిజమయ్యింది...

పూడూరు లో గత కొంతకాలంగా గంజాయి దందా సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఫ్రెండ్ షిప్ డే రోజున యువకుడు హత్య గంజాయి మత్తేనని ప్రచారం జరిగింది. ఆరోజు పలువురు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు నిఘా పెట్టగా ఎట్టకేలకు ముఠా పట్టుబడింది. ముఠాను పట్టుకునైన కొడిమ్యాల ఎస్ఐ సందీప్, హెడ్ కానిస్టేబుల్ రాజయ్య , కానిస్టేబుల్ లు తిరుమల్, రాజు, వినోద్, మల్యాల సీఐ నీలం రవి, డి.ఎస్.పి. రఘుచందర్ ను ఎస్పీ అభినదించి నగదు రివార్డ్ అందజేసారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)