తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kinnera Mogulaiah : అయ్యో పాపం.. మొగులయ్య ఇంటి కాంపౌండ్ వాల్ కూల్చేసిన దుండగులు

Kinnera Mogulaiah : అయ్యో పాపం.. మొగులయ్య ఇంటి కాంపౌండ్ వాల్ కూల్చేసిన దుండగులు

11 October 2024, 13:19 IST

google News
    • Kinnera Mogulaiah : కిన్నెర మొగులయ్య.. అలియాస్ దర్శనం మొగులయ్య. తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. అంత పేరున్నా.. కష్టాలు తక్కువేం కాదు. అందుకే ప్రభుత్వం ఆయనకు అండగా నిలిచింది. ఇంటి స్థలం ఇచ్చింది. ఆ స్థలంలో ఇళ్లు కట్టుకుంటుంటే.. కొందరు దుండగలు కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేశారు.
ధ్వంసమైన కాంపౌండ్ వాల్ దగ్గర కిన్నెర మొగులయ్య
ధ్వంసమైన కాంపౌండ్ వాల్ దగ్గర కిన్నెర మొగులయ్య (X)

ధ్వంసమైన కాంపౌండ్ వాల్ దగ్గర కిన్నెర మొగులయ్య

కిన్నెర మొగులయ్యకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఇంటి స్థలం ఇచ్చింది. ఆ స్థలంలో ఆయన ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకున్నారు. కాంపౌండ్ వాల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. కొందరు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మొగులయ్య ఇంటి కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేశారు. రాత్రికి రాత్రే కూల్చేశారు. దీంతో మొగులయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని వేడుకున్నారు కిన్నెర మొగులయ్య. ఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించారు. మొగులయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్ 24న దర్శనం మొగులయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలాన్ని అందించింది. హయత్‌నగర్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ ఇంటి స్థలం ధ్రువపత్రాలను మొగులయ్యకు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. తనకు ఇంటి స్థలం కేటాయించి, పత్రాలు అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే వంశీకృష్ణకు దర్శనం మొగులయ్య కృతజ్ఞతలు చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న మొగులయ్య.. ఆ మధ్య పొట్ట కూటి కోసం కూలీ పనులు చేయడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నగరం తుర్కయాంజల్‌లో ఓ ఇంటి వద్ద పని చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ ఆపివేయడంతో మొగులయ్య కూలీ పని చేస్తున్నారని ప్రచారం జరిగింది.

దీనిపై స్పందించిన కేటీఆర్.. మొగిలయ్యను కలిసి అండగా నిలిచారు. మొగులయ్యకు ఆర్థిక సాయాన్ని అందించారు. కళాకారుల పెన్షన్ తోపాటు అన్ని రకాల హామీలను నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. మొగులయ్య లాంటి కళాకారుడు ఉండటం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వం స్పందించి.. మొగులయ్యను ఆదుకుంది. ఇంటి స్థలాన్ని కేటాయించింది.

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో అవకాశం రావడంతో మొగులయ్య ఫేమస్ అయ్యారు. భీమ్లా నాయక్ పాట ద్వార రాత్రికి రాత్రే సెన్సేషన్ గా మారారు. కానీ.. ఆయనకు ఆర్థిక కష్టాలు తీరలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి రూపాయలు ఆర్థికసాయంతో పాటు 600 గజాలలో ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. అంతలోనే ఎన్నికలు రావడం.. ప్రభుత్వం రావడంతో మొగులయ్యకు సాయం అందలేదు. దీంతో మళ్లీ కష్టాలు తప్పలేదు.

తదుపరి వ్యాసం