తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Teachers Posting : విద్యాశాఖ కీలక ప్రకటన.. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్ వాయిదా

TG Teachers Posting : విద్యాశాఖ కీలక ప్రకటన.. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్ వాయిదా

15 October 2024, 11:01 IST

google News
    • TG Teachers Posting : తెలంగాణ విద్యాశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. మంగళవారం జరగాల్సిన కౌన్సెలింగ్ తెలంగాణ వ్యాప్తంగా వాయిదాపడింది.
డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్ వాయిదా
డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్ వాయిదా (HT)

డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్ వాయిదా

తెలంగాణలో 2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయలకు పోస్టింగ్‌ కౌన్సెలింగ్ వాయిదా పడింది. కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా కౌన్సెలింగ్‌ వాయిదాపడటంతో.. కొత్త టీచర్లు నిరాశతో వెనక్కి వెళ్తున్నారు. ఇటీవల ఎల్బీ స్టేడియం వేదికగా ఎంపికైన 10,006 మందికి నియామకపత్రాలను అందజేశారు. వారికి విద్యాశాఖ అధికారులు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ.. అనూహ్యంగా వాయిదా వేశారు.

నూతన టీచర్లు ఆయా డీఈవోలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌ కు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు తొలుత ప్రకటించారు. ఎక్కువగా కలెక్టరేట్ల లోనే కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరగనుందని అధికారులు వెల్లడించారు. దీంతో అందరూ సంబంధిత పత్రాలు తీసుకొని జిల్లా కేంద్రాలకు వెళ్లారు. తీరా వెళ్లాక పోస్టింగ్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కొత్త టీచర్లు తమకు కేటాయించిన పాఠశాలల్లో ఈనెల 16వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంది. కానీ.. కౌన్సెలింగ్ వాయిదా పడటంతో.. ఎప్పుడు చేరతారో తెలియని పరిస్థితి నెలకొంది.

సుమారు 7 వేల మంది పాత టీచర్లు రిలీవ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. పోస్టింగ్‌ల కేటాయింపు ఇవాళ దాదాపు పూర్తవుతుందని అంతా ఆశించారు. పోస్టింగ్ పూర్తయితే.. రిలీవ్ అవ్వడానికి మార్గం సుగమమం అయ్యేది. మూడు నెలల కిందట బదిలీలు జరిగాయి. అయితే.. కొత్తవారు వస్తే బదిలీ అయిన వారు రిలీవ్ అయ్యేందుకు అవకాశం ఉండేది. వారికి కేటాయించిన స్కూళ్లకు వెళ్లేవారు. సడెన్‌గా మంగళవారం జరగాల్సిన కౌన్సెలింగ్ వాయిదా పడటంతో.. వారు కూడా నిరాశ చెందుతున్నారు.

కొత్తగా ఎంపికైన ఎస్జీటీ టీచర్లకు మొత్తం జీతం రూ. 43,068గా నిర్ణయించారు. బేసిక్ పే 31,040, హెచ్‌ఆర్‌ఏ (11%) రూ.3,414, డీఏ (22.75%) 7,062, ఐఆర్‌ రూ.1,552గా ఉంది. స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు ఎంపికైన వారికి జీతం రూ. 58,691గా ఉంది. బేసిక్ పే రూ. 42,300గా ఉంది. హెచ్‌ఆర్‌ఏ (11%) రూ.4,653, డీఏ (22.75%) రూ.9,623, ఐఆర్‌ రూ.2,115గా నిర్ణయించారు.

తదుపరి వ్యాసం