TG High Court Death Penalty : నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య -ఉరిశిక్ష విధించిన హైకోర్టు
31 July 2024, 22:43 IST
- TG High Court Death Penalty : నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి ఉరి శిక్ష విధించడం సబబేనని సమర్థించింది.
నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య -ఉరిశిక్ష విధించిన హైకోర్టు
TG High Court Death Penalty : చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడి దిగువ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో మూడేళ్ల క్రితం రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. నిందితుడు దినేష్ కుమార్ హైకోర్టు ఉరిశిక్షణు ఖరారు చేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. 2017లో నార్సింగి పీఎస్ పరిధిలో నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు దినేష్ కుమార్ ఆపై చిన్నారిని హత్య చేశాడు. ఈ కేసును విచారణ చేపట్టిన రంగారెడ్డి కోర్టు 2021లో నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే రంగారెడ్డి కోర్టు తీర్పుపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు దినేష్‌కు ఉరిశిక్ష విధించడం సరైనదే అని బుధవారం తీర్పు ఇచ్చింది.
అసలేం జరిగింది?
అల్కాపురి టౌన్‌షిప్‌లో ఒడిశాకు చెందిన భార్యభర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మధ్యప్రదేశ్ కు చెందిన దినేష్ అనే వ్యక్తి అక్కడ సెంట్రింగ్ పని చేస్తూ ఉండేవాడు. దినేష్ ఒడిశా దంపతులతో స్నేహంగా ఉండేవాడు. 2021, డిసెంబర్12న ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఒడిశా దంపతుల నాలుగున్నరేళ్ల కుమార్తెకు చాకెట్ల ఆశ చూపించి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై లైంగిక దాడి చేశాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతుందనే భయంతో బండరాయితో చిన్నారి తలపై బాది హత్య చేశాడు. చిన్నారి ఆచూకీ కనిపించకపోవడంతో తల్లిదండులు ఇంటి పరిసరాల్లో వెతికారు. అప్పటికీ చిన్నారి ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా, చివరిసారిగా బాలికను దినేష్‌తో చూశామని స్థానికులు చెప్పారు. దీంతో పోలీసులు దినేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. దీంతో పోలీసులు నిందితుడిపై లైంగిక దాడి, హత్యతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అన్ని సాక్ష్యాలను పోలీసులు రంగారెడ్డి కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు నిందితుడికి ఉరి శిక్ష విధించింది. రంగారెడ్డి కోర్టు తీర్పును నిందితుడు దినేష్ హైకోర్టు సవాల్ చేశాడు. తాజాగా హైకోర్టు రంగారెడ్డి కోర్టు తీర్పును సమర్థిస్తూ నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేసింది.