Vijayawada Crime : బాలికపై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు, ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష
Vijayawada Crime : బాలికపై అత్యాచారం కేసులో విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి 20 ఏళ్లు కఠినకారాగార శిక్షి విధించింది.
Vijayawada Crime : బాలికపై అత్యాచారం చేసిన కేసులో ముగ్గురు నిందితులకు ఒకొక్కరికి 20 ఏళ్లు కఠినకారాగార శిక్ష, జరిమానా విధించింది కోర్టు. ఎన్టీఆర్ జిల్లా కొత్తపేట, ఆంజనేయ వాగు సెంటర్ కు చెందిన బాలిక (17) తన కుటుంబంతో జీవిస్తుంది. బాలిక తండ్రి 16 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న బాలిక వాళ్ల అమ్మతో కలిసి డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలుగు స్తంభాలు ఏరియాకు చెందిన ఉత్తరాది గురు సాయి చంద్ర(19) అనే యువకుడు బాలికను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని, ఇంట్లో పరిచయం చేస్తానని చెప్పి సెప్టెంబర్ 29, 2019న తన ఇంటికి రమ్మని బాలికకు చెప్పాడు. యువకుడి మాటలు నమ్మి అతని ఇంటి వెళ్లింది బాలిక. సాయి చంద్ర బాలికను బలవంతం చేయడానికి ప్రయత్నించగా...ఆమె ఒప్పుకోలేదు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన గొల్లా సాయి(21) మరో ఇద్దరు జువైనల్స్ బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పొద్దని, తనని పెళ్లి చేసుకుంటానని సాయి చెప్పడంతో బాలిక ఇంటికి వెళ్లిపోయింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి
ఆ తర్వాతి రోజు బాలికకు ఫోన్ చేసిన సాయి... పున్నమిఘాట్ కు రమ్మని చెప్పగా ఆమె అక్కడికి వెళ్లింది. ఉత్తరాది సాయి బాలికను నీలిమా థియేటర్ వెనుకవైపు ఉన్న షాదీఖాన సమీపంలోనికి తీసుకువెళ్లగా... అప్పటికే అక్కడ పెయ్యల తరుణ్ కుమార్(20) మరో ఇద్దరు జువైనల్స్ ఉన్నారు. వీరిలో ఒకడు బాలిక గొంతు పట్టుకుని, ఏవో టాబ్లెట్స్ మింగించాడు. దీంతో ఆమె మైకం లోనికి వెళ్లగా వారందరూ బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవ్వరికి చెప్పకుండా ఉంటే తనను పెళ్లి చేసుకుంటానని ఉత్తరాది సాయి మరోసారి బాలికను నమ్మించాడు. కొద్ది రోజుల తరువాత పెళ్లి చేసుకోనని సాయి చెప్పడంతో జరిగిన సంఘటనను బాలిక తల్లితో చెప్పింది. దీంతో బాలిక తల్లి 2019 డిసెంబర్ 3 న భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష
ఈ కేసులో నిందితులైన ఉత్తరాది గురు సాయి చంద్ర, గొల్లా సాయి, పెయ్యల తరుణ్ కుమార్ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు పంపినారు. అనంతరం ఈ ముగ్గురిపై రౌడీ షీట్ సస్పెక్ట్ షీట్లను తెరిచారు. దర్యాప్తు అనంతరం ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అదే విధంగా నిందితులైన మరో నలుగురు జువైనల్స్ లను అదుపులోనికి తీసుకుని ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ జువైనల్ జస్టిస్ బోర్డ్ వద్ద హాజరు పెట్టి జువైనల్ హోంకు తరలించారు. విచారణ అనంతరం ముగ్గురు నిందితులైన సాయి చంద్ర, గొల్లా సాయి, పెయ్యల తరుణ్ కుమార్ పై నేరం రుజువు కావడంతో ఇవాళ విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఒకొక్కరికి 20 సంవత్సరాలు కఠిన కారాగార జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. జువైనల్స్ పై ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ జువైనల్ జస్టిస్ బోర్డ్ వద్ద కేసు విచారణలో ఉంది. నిందితులు చెల్లించిన జరిమానా మొత్తం బాలికకు అందజేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
సంబంధిత కథనం