Salman Khan Firing Case: అతడే నన్ను చంపాలనుకున్నాడు: తన ఇంటిపై ఫైరింగ్ కేసులో సల్మాన్ ఖాన్ వాంగ్మూలం-salman khan house firing case bollywood actor says lawrence bishnoi tried to kill him ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Khan Firing Case: అతడే నన్ను చంపాలనుకున్నాడు: తన ఇంటిపై ఫైరింగ్ కేసులో సల్మాన్ ఖాన్ వాంగ్మూలం

Salman Khan Firing Case: అతడే నన్ను చంపాలనుకున్నాడు: తన ఇంటిపై ఫైరింగ్ కేసులో సల్మాన్ ఖాన్ వాంగ్మూలం

Hari Prasad S HT Telugu
Jul 24, 2024 09:27 PM IST

Salman Khan Firing Case: ముంబై పోలీసులు దాఖలు చేసిన ఛార్జీషీట్ లో లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ పేర్లను సల్మాన్ ఖాన్ పేర్కొన్నాడు.

అతడే నన్ను చంపాలనుకున్నాడు: తన ఇంటిపై ఫైరింగ్ కేసులో సల్మాన్ ఖాన్ వాంగ్మూలం
అతడే నన్ను చంపాలనుకున్నాడు: తన ఇంటిపై ఫైరింగ్ కేసులో సల్మాన్ ఖాన్ వాంగ్మూలం

Salman Khan Firing Case: తన ఇంటి వెలుపల జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు దాఖలు చేసిన ఛార్జీషీట్ లో సల్మాన్ ఖాన్ తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. ఏప్రిల్ లో తన నివాసంలో జరిగిన కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కారణమని తాను నమ్ముతున్నానని అతడు పోలీసులకు తెలిపాడు.

ఏప్రిల్ 14 తెల్లవారుజామున గెలాక్సీ అపార్ట్ మెంట్స్ లోని తన నివాసంలో నిద్రిస్తున్న సమయంలో బాణసంచా లాంటి శబ్దం వినిపించిందని, ఇది తనతో పాటు తన కుటుంబ సభ్యుల ప్రాణాలు తీయడానికి జరిగిన ప్రయత్నమని సల్మాన్ అనడం గమనార్హం.

లారెన్స్ బిష్ణోయే కారణం

తనను చంపడానికి లారెన్స్ బిష్ణోయ్ ప్రయత్నించినట్లు తన వాంగ్మూలంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ వెల్లడించాడు. మొదటి అంతస్తు బాల్కనీలో మోటారు సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసు బాడీగార్డు ఉదయం 4:55 గంటలకు తనకు సమాచారం అందించినట్లు తెలిపాడు. గతంలో తనకు, తన కుటుంబానికి హాని కలిగించే ప్రయత్నాలు జరిగాయని కూడా అతడు పోలీసులతో చెప్పాడు. ఈ కాల్పులపై అతని బాడీగార్డు బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఫేస్ బుక్ పోస్ట్ లో దాడికి తామే బాధ్యులమని అంగీకరించారు.

లారెన్స్ బిష్ణోయ్, అతని ముఠా సభ్యులు గతంలో కూడా సల్మాన్ ను, అతని బంధువులను చంపేస్తామని బెదిరించారు. "కాబట్టి, లారెన్స్ బిష్ణోయ్, తన ముఠా సభ్యుల సహాయంతో, నా కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో కాల్పులకు పాల్పడ్డారని నేను నమ్ముతున్నాను. వాళ్లు నన్ను, నా కుటుంబ సభ్యులను చంపడానికి ప్లాన్ చేశారు" అని ఈ నటుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి ఇటీవలి కాలంలో అనేక బెదిరింపులు వచ్చాయని పోలీసులకు తెలిపాడు.

సల్మాన్ ఖాన్ కు బెదిరింపు మెయిల్స్

2022లో సల్మాన్ బిల్డింగ్ కు ఎదురుగా ఉన్న బెంచ్ పై బెదిరింపు లేఖ దొరికింది. 2023 మార్చిలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. 2024 జనవరిలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ గుర్తింపులతో పన్వేల్ సమీపంలోని తన ఫాంహౌస్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని సల్మాన్ వెల్లడించాడు.

ఈ నెల ప్రారంభంలో పోలీసులు కాల్పుల కేసులో 1,735 పేజీల చార్జిషీట్ ను మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కేసుల ప్రత్యేక కోర్టులో దాఖలు చేశారు. అరెస్టయిన ఆరుగురు నిందితులపై చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంటూ కోర్టు ఇటీవల చార్జిషీట్ ను ఆమోదించింది.

ఈ కేసులో విక్కీకుమార్ గుప్తా, సాగర్ కుమార్ పాల్, సోనూకుమార్ బిష్ణోయ్, అనుజ్ కుమార్ థాపన్ (ఇప్పటికే చనిపోయాడు), మహ్మద్ రఫీక్ చౌదరి, హర్పాల్ సింగ్ లను అరెస్టు చేశారు. అరెస్టయిన తర్వాత పోలీసుల అదుపులోనే అనూజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగిలిన ఐదుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Whats_app_banner