Salman Khan: నా కొడుకుకి పెళ్లి చేసుకునే ధైర్యం లేదు.. ఆ భయం వల్లే ఇలా..: సల్మాన్ ఖాన్‌పై తండ్రి కామెంట్స్ వైరల్
Salman Khan: సల్మాన్ ఖాన్ ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఈ ప్రశ్నకు అతని తండ్రి సలీమ్ ఖాన్ సమాధానం చెప్పేశారు. అతడు పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయడం లేదంటూ దానికి కారణమేంటో కూడా వెల్లడించారు.
Salman Khan: ఇండియాలోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. 58 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా కాలం వెల్లదీస్తున్నాడు. టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా చేసుకుంటానంటూ అతడు చెబుతూ వెళ్తున్నాడు. తాజాగా సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ అతని పెళ్లిపై స్పందించిన ఓ పాత వీడియో వైరల్ అవుతోంది.
సల్మాన్ అందుకే పెళ్లి చేసుకోలేదు
సల్మాన్ ఖాన్ వయసు 58 ఏళ్లు. ఇక అతడు పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. తన కెరీర్లో సంగీతా బిజ్లానీ, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ లాంటి ఎంతో మందితో డేటింగ్ చేసిన అతడు.. పెళ్లి ఊసు మాత్రం ఎత్తలేదు. దీనికి కారణం వచ్చే అమ్మాయి తన తల్లిలాగా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటుందన్న నమ్మకం సల్మాన్ కు లేకపోవడమే అని సలీమ్ చెప్పారు.
"అతడు సులువుగా ఓ రిలేషన్షిప్ లోకి వెళ్తాడు. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ధైర్యం చేయడు. అతనిది చాలా సింపుల్ స్వభావం. సులువుగా ఆకర్షితుడు అవుతాడు. కానీ తన తల్లిలాగే వచ్చే అమ్మాయి ఇంటిని చూసుకుంటుందో లేదో అన్న భయం అతనికి ఉంది. తన తల్లిలాగే ఏ అమ్మాయి అయినా తన భర్తకి, కుటుంబానికి పూర్తిగా అంకితమవ్వాలని అనుకుంటాడు. పిల్లల కోసం వంట వండాలి.. వాళ్లను రెడీ చేయాలి.. హోంవర్క్ చేయించాలి అనుకుంటాడు. కానీ ఈ కాలంలో అలా దొరకడం కష్టం" అని సలీమ్ ఖాన్ తెలిపారు.
నేను అందుకే పెళ్లి చేసుకోలేదు: సల్మాన్
గతంలో రజత్ శర్మకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ కూడా తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదన్నదానిపై స్పందించాడు. "ఎందుకంటే మొదటి వ్యక్తి వెళ్లిపోయినప్పుడు అది ఆమె తప్పు అనిపించింద. రెండో వ్యక్తి వెళ్లిపోయినప్పుడు కూడా ఆమె తప్పిదమే అని, మూడో వ్యక్తి వెళ్లిపోయినప్పుడు కూడా అదే అని అనుకుంటాం. కానీ నాలుగోసారి అదే జరిగినప్పుడు తప్పు వాళ్లలో ఉందా లేక నాలో ఉందా అన్న అనుమానం కలుగుతుంది. నా భయం వల్లే వాళ్లకు ఆ జీవితాన్ని, సంతోషాన్ని నేను ఇవ్వలేకపోయాను" అని సల్మాన్ అన్నాడు.
మూడున్నర దశాబ్దాలుగా బాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరిగా సల్మాన్ ఖాన్ ఉన్నాడు. చివరిగా టైగర్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ప్రస్తుతం ఏఆర్ మురగదాస్ తో కలిసి సికందర్ మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇదే కాకుండా మరో రెండు సినిమాల్లోనూ అతడు నటిస్తున్నాడు. డైరెక్టర్ విష్ణువర్దన్ మూవీ ది బుల్ తోపాటు షారుక్ ఖాన్ తో కలిసి టైగర్ వర్సెస్ పఠాన్ మూవీ కూడా చేయబోతున్నాడు. ఈ ఇద్దరు ఖాన్లు కలిసి చేయబోయే ఈ సినిమాపై బాలీవుడ్ భారీ ఆశలే పెట్టుకుంది.