TG Ration Card Update : రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్- వివరాల మార్పు, చేర్పులకు అవకాశం
17 November 2024, 15:10 IST
TG Ration Card Update : తెలంగాణ సర్కార్ రేషన్ కార్డు వివరాల మార్పు చేర్పులపై కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల్లో కొత్త వారి పేర్లు జోడించడం, మరణించిన వృద్ధుల పేర్లు తొలగించడం... మార్పులకు మీ-సేవా కేంద్రాల్లో అవకాశం కల్పించారు.
రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్- వివరాల మార్పు, చేర్పులకు అవకాశం
తెలంగాణలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు. దీంతో రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం లేకపోయింది. కుటుంబాల్లో వృద్ధుల మరణాలు, పెళ్లిల్లు, పిల్లలు జన్మించడం ఇలా ఎన్నో మార్పులు జరిగాయి. ఇలాంటి సందర్భాల్లో కొత్త పేర్లు చేర్చేందుకు, అవసరంలేని పేర్లు తొలగించేందుకు ఇన్నిరోజులు ఎలాంటి అవకాశం లేకపోయింది. రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
రేషన్ కార్డుదారులు తమ వివరాలు మార్చుకునేందుకు మీ-సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. మీ దగ్గర్లోని మీ-సేవా కేంద్రానికి వెళ్లి.. ఎవరి వివరాలు జోడించాలో, మార్పు చేయాలో వారికి సంబంధించిన గుర్తింపుకార్డులు, అవసరమైన పత్రాలు, ఫొటో తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్లాలి. రేషన్ కార్డులో భార్య పేరును యాడ్ చేయాలనుకుంటే.. ఆమె ఫొటో, గుర్తింపు కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుని మీ-సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. పిల్లల పేర్లు చేర్చాలనుకున్నా, ఆ పిల్లల గుర్తింపు కార్డులు, ఫొటోలతో పాటు బర్త్ సర్టిఫికెట్లు కావాలి. రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు సంబంధించి...అవసరమైన పత్రాలు ఆపరేటర్లు స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.
మీ-సేవా కేంద్రాల ద్వారా అప్ లోడ్ చేసిన మీ వివరాలు పౌర సరఫరాల శాఖకు చేరుతాయి. ఈ వివరాలను అధికారులు పరిశీలించి మార్పులను ఆమోదిస్తారు. ఈ ప్రక్రియకు సుమారు 7 పని దినాలు పట్టే అవకాశం ఉంది. మీ-సేవా కేంద్రం వద్ద ఇచ్చే అప్లికేషన్ నెంబర్ ద్వారా మీ రేషన్ కార్డు స్టేటస్ ను సివిల్ సప్లైస్ అధికారిక వెబ్‌సైట్ https://civilsupplies.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చు. రేషన్ కార్డులో మార్పులు జరిగితే మీ మొబైల్‌కి సందేశం వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోయినా ఆహార భద్రతా కార్డులో వివరాలు అప్డేట్ అవుతాయి. మీ-సేవా కేంద్రాల్లో ఆహార భద్రతా కార్డును ప్రింట్ తీసుకోవచ్చు.
తెలంగాణలో రేషన్ కార్డులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. రేషన్ కార్డుల్లో పేర్లను చేర్చాలని కోరుతూ ఇప్పటికే లక్షలాది కుటుంబాలు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో లక్షల కుటుంబాలు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి. వినియోగంలో ఉన్న రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంతో అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
తెలంగాణలో అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 11.08 లక్షల దరఖా స్తులు పెండింగ్‌లో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ లెక్కలు చెబుతున్నాయి. పాత దరఖాస్తులను పరిష్కరిస్తే ప్రతి నెల దాదాపు 9,890 టన్నుల బియ్యం అదనంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి నెల రూ.37.40 కోట్ల భారం పడుతుంది. పత్రి ఇంటికి డిజిటల్ ఫ్యామిలీ కార్డులను జారీ చేసి రేషన్ కార్డుల్లో ఉన్న సమాచారాన్ని వాటితో అనుసంధానించాలని యోచిసక్తున్నారు. దీనికోసం పూర్తి స్థాయిలో సాఫ్ట్‌వేర్ సిద్దం చేస్తున్నారు. డిజిటల్ కార్డు ద్వారా రేషన్ దుకాణాల్లో ప్రతి ఇంటికి ఎంత సరుకులకు అర్హత ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కార్డులను క్రమబద్దీకరణ పూర్తైన తర్వాత కొత్త కార్డుల జారీ ప్రక్రియ చేపట్టనున్నారు.