TG Gulf Workers : గల్ఫ్ బాధితులకు తెలంగాణ సర్కార్ అండ, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
08 October 2024, 15:39 IST
- TG Gulf Workers Compensation : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, మార్గదర్శకాలు ప్రకటించింది.
గల్ఫ్ బాధితులకు తెలంగాణ సర్కార్ అండ, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి, అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తన కుటుంబం బాగుండాలనే ఉద్దేశంతో గల్ఫ్ దేశాల్లో ఎంతో మంది ఎన్నో కష్టాలు భరిస్తున్నారు. కొందరైతే యజమానుల వేధింపులు తట్టుకోలేక సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్న ఘటనలు చూశాం. ఏజెంట్ల మోసాలకు బలై గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారూ లేకపోలేదు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది.
తెలంగాణ నుంచి చాలా మంది గల్ఫ్ దేశాలకు జీవనోపాధి కోసం వెళ్తుంటారు. అక్కడ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ మృతుల కుటంబాలను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధిత కుటుంబాలకు భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన కార్మికులకు భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
మార్గదర్శకాలు విడుదల
ఈ నిర్ణయం సీఎస్ శాంతి కుమారి తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు. గల్ఫ్ మృతుల కుటంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. కువైట్, బహ్రెయిన్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో 2023 డిసెంబరు 7 తర్వాత మరణించిన కార్మికులకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. అర్హులను సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది.
సీఎస్ శాంతి కుమారి గల్ఫ్ పరిహారం మార్గదర్శకాలను విడుదల చేశారు. గల్ఫ్ లో కార్మికులు మృతి చెందిన ఆరు నెలల్లోగా బాధితుడి భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డెట్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతా వివరాలు అందించాలని తెలిపారు. ఇలా అన్ని అర్హతలు ఉన్నవారికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం నేరుగా మృతుల కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
మార్గదర్శకాలు ఇవే
- ఏడు గల్ఫ్ దేశాలు- బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మృతి చెందిన తెలంగాణ కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది.
- మృతుల భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులను మాత్రమే కుటుంబసభ్యులుగా పరిగణిస్తారు. ప్రాధాన్య క్రమంలో వీరికి పరిహారం అందజేస్తారు.
- దరఖాస్తుతో పాటు గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుడి మరణ ధ్రువీకరణ పత్రం, రద్దు చేసిన పాస్‌పోర్టు, ప్రభుత్వం నిర్దేశించిన దేశంలో పనిచేస్తున్నట్లు వీసా ధ్రువీకరణ పత్రం, ఎక్స్‌గ్రేషియా పొందే వారి బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాలి.
- అన్ని ధ్రువీకరణ పత్రాలతో అర్హులైన కుటుంబ సభ్యులు తమ జిల్లా కలెక్టరుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును, ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ పరిశీలిస్తారు.
- దరఖాస్తు పరిశీలన అనంతరం పరిహారం మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇస్తారు. వెంటనే బాధిత కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్‌లో రూ.5 లక్షల పరిహారం జమ అవుతుంది.
- గల్ఫ్ కార్మికుడు మృతి చెందిన నాటి నుంచి లేదా మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకున్న నాటి నుంచి ఆరు నెలల్లోగా బాధితులు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు అందిన తర్వాత సాధ్యమైనంత తక్కువ సమయంలో కలెక్టర్లు ప్రొసీడింగ్స్ చేసి ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేస్తారు.