Gulf Jobs Scam: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలు… సిరిసిల్లలో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు
Gulf Jobs Scam:ఉన్న ఊరిలో ఉపాధి కరువై... బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునే వారిని మోసం చేసే ముఠా గుట్టురట్టయింది.
Gulf Jobs Scam: రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా పట్టుబడ్డ వ్యక్తి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 60 మందికి పైగా మోసం చేసినట్లు వెల్లడైంది.
జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ వెల్లడించిన వివరాల ప్రకారం రుద్రంగి మండలం మనాల అడ్డబోర్ తండాకు చెందిన అజ్మీరా కిషన్, సేపూరి తిరుపతి , కాల్వ ఉమా మహేష్ ముగ్గురు అక్రమ దందాకు తెరలేపారు.
ఆర్మేనియం దేశంలో లక్షల్లో వేతనం గల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అమాయక ప్రజలను నమ్మించారు. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి గల్ఫ్ దేశాలకు పంపకుండా మోసాలకు పాల్పడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 60 మందికి పైగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అజ్మీరా కిషన్ మానాల గ్రామానికి చెందిన కోల కృష్ణంరాజు అనే వ్యక్తి ని ఉపాధి నిమిత్తం అర్మేనియా అక్కడి నుండి రష్యా దేశానికి పంపిస్తానని మాయమాటలు చెప్పి 4,50,000/- రూపాయలు ఖర్చు అవుతుందని డబ్బులు చెల్లించిన నెల రోజుల లోపు అర్మేనియా దేశానికి పంపిస్తానని నమ్మబలికాడు.
అదే విధంగా పెగ్గెర్ల కి చెందిన తేలు రంజిత్ అనే వ్యక్తి వద్ద 7,50,00/-, మెట్పల్లి కి చెందిన గరిపెల్లి శశిధర్ వద్ద 6,50,000/- అంబారిపేటకు చెందిన నరేష్ వద్ద 4,70,000/- ఆత్మకూరు కి చెందిన పుప్పాల సందీప్ వద్ద 7,50,000/- ముర్రిమాడు కి చెందిన అమరకొండా అనిల్ వద్ద 4,30,000/- మల్లేష్ వద్ద 4,50,000/- , మెట్పల్లి కి.చెందిన గుంటుగా రాజేష్ వద్ద 2,50,000/- వసూలు చేశాడు. వారికి విజిటర్ వీసాలు ఇచ్చి ఆర్మేనియం దేశం పంపి అక్కడ మూడు నెలలు ఉంచుకొని ఎలాంటి పని చూపించకుండా అక్కడ ఎలాంటి వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేయడంతో మోసపోయామని గ్రహించి కోల కృష్ణంరాజు పోలీసులకు పిర్యాదు చేశాడు.
కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు రుద్రంగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపగా గల్ఫ్ మోసం బయటపడిందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం అజ్మీరా కిషన్ ను అరెస్ట్ చేయగా మరో సేపూరి తిరుపతి, కాల్వ ఉమా మహేష్ పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు.
నకిలీ గల్ఫ్ ఏజెంట్లు తీరు మార్చుకోకపోతే కఠినచర్యలు-
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో అజ్మీరా కిషన్, సేపూరి తిరుపతి , కాల్వ ఉమా మహేష్ చేతిలో మోసపోయిన బాధితులు 60 కి పైగా ఉన్నారని వారంత తమ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. ఉపాది కల్పిస్తామంటే గల్ఫ్ వెళ్ళేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దన్నారు.
ఇమ్మిగ్రేషన్, చట్టబద్ధత ఉన్నవారు నుంచి వీసాలు పొందాలని సూచించారు. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారు తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు చేపడుతామని ఎస్పీ హెచ్చరించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకొనుటకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ 8712656411 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించవచ్చని సూచించారు.
రెండు గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు గంజాయి కేసుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 200 గ్రాముల గంజాయి, ఒక గంజాయి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటకు చెందిన జక్కనపల్లి వివేక్, ఇల్లంతకుంటకు చెందిన అంతటి వేణు, తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన క్రాంతి ఉన్నారు.
వివేక్, వేణు ఇద్దరు గంజాయి తాగడానికి అలవాటు పడి తంగళ్ళపల్లి కి చెందిన క్రాంతి వద్ద గంజాయి కొనుగోలు చేసి అట్టి గంజాయి తాగుతూ మిగిలిన గంజాయి అమ్మడానికి వివేక్, వేణు ఇద్దరు అంబగుడి వద్దకి వస్తున్నారన్న సమాచారం మేరకు సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా ముగ్గురు పట్టుబడ్డారని ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 47 కేసులలో 121 మందిని అదుపులోకి 31.80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ ప్రకటించారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)