Gulf struggle: మళ్లీ గల్ఫ్ బాట పట్టి మోసపోతున్న యువత.. ఆరు నెలల్లో 21 మంది మృతి-gulf agents are cheating telangana youth in the name of jobs 21 dead in six months ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gulf Struggle: మళ్లీ గల్ఫ్ బాట పట్టి మోసపోతున్న యువత.. ఆరు నెలల్లో 21 మంది మృతి

Gulf struggle: మళ్లీ గల్ఫ్ బాట పట్టి మోసపోతున్న యువత.. ఆరు నెలల్లో 21 మంది మృతి

Basani Shiva Kumar HT Telugu
Aug 16, 2024 12:06 PM IST

Gulf struggle: కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుద్దామని ఎందరో తెలంగాణ యువకులు గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. కానీ.. అక్కడి ఏజెంట్లు మోసం చేయడంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. గడిచిన 6 నెలల్లో కేవలం ఒక్క కామారెడ్డి వాసులే 21 మంది మృతిచెందడం కలకలం రేపుతోంది.

గల్ఫ్ బాధితుల ఆవేదన
గల్ఫ్ బాధితుల ఆవేదన

స్థానికంగా ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో.. తెలంగాణ యువకులు మళ్లీ గల్ఫ్ దేశాల బాట పట్టి మోసపోతున్నారు. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి.. గడిచిన ఆరు నెలల్లో 21 మంది కామారెడ్డి వాసుల మృతిచెందారు. ఉద్యోగాల పేరితో ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి గల్ఫ్ దేశానికి పంపి ఏజెంట్లు మోసం చేస్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాల్లేక.. వ్యవసాయం గిట్టుబాటు కాక.. ఉత్తర తెలంగాణ జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్ నుంచి సుమారు 3 లక్షల మంది గల్ఫ్ దేశాల బాట పట్టారు.

అప్పు తీర్చే దారి లేక..

గల్ఫ్ దేశాలకు చేరుకోవడానికి తాము చేసిన అప్పు తీర్చే దారి లేక.. వెనక్కి తిరిగి రాలేక.. అక్కడే ఆత్మహత్య చేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటకు చెందిన ఆవుల ఓదెలు (35) ఎనిమిది నెలల కిందట రూ.2 లక్షల వరకు అప్పులు చేసి దుబాయి వెళ్లాడు. మంచి కంపెనీ అని ఏజెంట్ చెప్పడంతో నమ్మి వెళ్లిన ఓదెలు.. తీరా అక్కడకు వెళ్లాక తనది పర్యాటక వీసా కావడంతో మోసపోయానని కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఇరవై రోజుల కిందట ఇంటికి ఫోన్ చేసిన ఓదెలు.. చేసిన పనికి వేతనం ఇవ్వడం లేదని.. ప్రశ్నిస్తే కొడుతున్నారని.. ఇంటికి వస్తానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో స్వగ్రామానికి రావాలని భార్య వర్షిణి, తల్లి లక్ష్మి సూచించారు.

తప్పుడు వీసాతో మోసం..

కొన్ని రోజుల నుంచి ఓదెలు ద్వారా ఎలాంటి సమాచారం లేదు. ఫోన్ స్విచాఫ్ వస్తుంది. దీంతో ఆందోళన చెందిన ఓదెలు కుటుంబ సభ్యులు.. దుబాయిలో ఉన్న వారి సాయంతో ఆరా తీశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. జగిత్యాలకు చెందిన ఏజెంట్ తన భర్తను మోసం చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ నాలుగు రోజుల కిందట ఓదెలు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఓదెలు మృతిచెందినట్లు దుబాయిలో ఉన్న సాయంపేట వ్యక్తులు అతని కుటుంబానికి సమాచారం అందించారు. తన భర్తను అక్కడి కంపెనీ ప్రతినిధులు కొట్టడంతోనే మృతి చెందాడని.. తప్పుడు వీసాతో మోసం చేసిన ఏజెంటుపై చర్యలు తీసుకోవాలని ఓదెలు భార్య, తల్లి కోరుతున్నారు.

ఏజెంట్ల వ్యవస్థతో ఇబ్బందులు..

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గల్ఫ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని.. కేరళ మాదిరిగా గల్ఫ్ దేశాలకి వెళ్లే వారికి ముందస్తు నైపుణ్య శిక్షణ, అక్కడ కేసుల్లో చిక్కుకున్న వారికి న్యాయ, వైద్య సహయం అందించాలని.. గల్ఫ్ ఏజెంట్ల ఆగడాలను నియంత్రించడం వంటి చర్యలు తీసుకోవాలని గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాల నేతలు కోరుతున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన టామ్ కామ్ ద్వారా వీసాలు జారీ చేస్తే ఏజెంట్ల వ్యవస్థ కనుమరుగయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.