TGSRTC : ఆర్టీసీలో అద్దె వాహనాలే సగం.. డొక్కు బస్సులతో సిబ్బందికి ఇబ్బందులు!
24 October 2024, 11:57 IST
- TGSRTC : తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది.. డొక్కు బస్సులతో ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు పాతవి కావడం, నిర్వహణ సరిగా లేకపోవడంతో.. ఎక్కడపడితే అక్కడే ఆగిపోతున్నాయి. ఫలితంగా అటు ప్రయాణికులు, ఇటు సిబ్బంది తిప్పలు పడుతున్నారు. కొత్త బస్సులు సమకూర్చాలని కోరుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణలోని ఆర్టీసీ బస్సులు చాలావరకు పాతబడ్డాయి. వాటితోనే సంస్థ నెట్టుకొస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. డొక్కు బస్సుల్లో ప్రయాణం ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. పాత బస్సులను నడపటం కష్టంగా ఉందని సిబ్బంది వాపోతున్నారు. పాత బస్సుల స్థానంలో కొత్తవి సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉదాహరణకు.. ఆదిలాబాద్ రీజియన్‌లోని 6 డిపోలు ఉన్నాయి. మొత్తం 620 బస్సులున్నాయి. వాటిల్లో 311 అద్దె బస్సులే ఉన్నాయి. 309 బస్సులు ఆర్టీసీవి. ఆర్టీఏ నిబంధనల ప్రకారం.. 15 ఏళ్లు దాటినా.. 13 లక్షల కిలోమీటర్ల వరకు తిరిగిన బస్సులను వినియోగించొద్దు. కానీ.. ఈ నిబంధనలు ఆర్టీసీలో అమలు కావటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కేవలం ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోనే 16 లక్షల కిలోమీటర్ల దాటిన బస్సులు 70 ఉన్నాయి. వాటినే ఇంకా తిప్పుతూనే ఉన్నారు. 30 నుంచి 40 బస్సులను స్క్రాప్‌కు పంపించాల్సి ఉన్నా.. కొత్త బస్సుల్లేక.. పాత వాటినే రోడ్లపైకి ఎక్కిస్తున్నారు. ఇక అద్దె బస్సుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిచేదు.
భైంసా డిపో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ డిపో పరిధిలోని బస్సులన్నీ పాతవేనని సిబ్బంది చెబుతున్నారు. 32 బస్సులు ఉండగా.. వాటిలో 30 పాతవేనని వాపోతున్నారు. మంగళవారం రాత్రి కూడా భైంసా బస్టాండు దాటకుండానే ఓ బస్సు నిలిచిపోయింది. మెకానిక్‌లు వచ్చి మరమ్మతులు చేశారు. సాయంత్రం 6 వరకే విధులు నిర్వహించాల్సిన మహిళా కండక్టర్.. రాత్రి 9:30 గంటలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేవలం ఆదిలాబాద్ రీజియన్ మాత్రమే కాదు.. ఇతర జిల్లాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. సంస్థ పాత బస్సులను స్కాప్‌కు పంపించి.. కొత్త బస్సులను ఇవ్వాలని డిపోల అధికారులు కోరుతున్నారు. పాత బస్సులను ఇలాగే కొనసాగిస్తే.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు.