TGSRTC: శభాష్.. బస్సులోనే గర్భిణికి డెలివరీ చేసిన మహిళా కండక్టర్‌-tgsrtc woman conductor delivered a pregnant woman in a bus on rakshabandhan day ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc: శభాష్.. బస్సులోనే గర్భిణికి డెలివరీ చేసిన మహిళా కండక్టర్‌

TGSRTC: శభాష్.. బస్సులోనే గర్భిణికి డెలివరీ చేసిన మహిళా కండక్టర్‌

Basani Shiva Kumar HT Telugu
Aug 19, 2024 09:59 AM IST

TGSRTC: రాఖీ పండగ పర్వదినాన.. బస్సులోనే గర్భిణికి డెలివరీ చేసి మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. ఆ తర్వాత తల్లీబిడ్డను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

శిశువుతో కండక్టర్ భారతీ
శిశువుతో కండక్టర్ భారతీ (tgsrtcmdoffice )

గద్వాల డిపోకు చెందిన.. గద్వాల- వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో.. సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి ఎక్కింది. రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు సంధ్య వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే.. సంధ్యతు పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సాయంతో.. గర్భిణికి పురుడు పోశారు. సంధ్య పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు.

తల్లీబిడ్డా క్షేమం..

డెలివరీ తర్వాత 108 సాయంతో.. తల్లీబిడ్డను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. అయితే.. రక్షాబంధన్‌ పర్వదినాన బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్‌ భారతికి టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అభినందనలు తెలిపింది. కండక్టర్ సమయస్పూర్తితో వ్యవహారించి.. నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది.

యాజమాన్యం అభినందనలు..

ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయం అని యాజమాన్యం అభినందించింది. ఇటు ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు, ఆ మార్గంలో వెళ్లిన ప్రజలు కూడా కండక్టర్, నర్సు చేసిన పనిని అభినందించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని.. ఇతర ఉద్యోగులు వీరిని స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు.