TS HC On DOST Admissions: 'దోస్త్' లేకుండానే డిగ్రీ అడ్మిషన్లు - ఈ కాలేజీలకు మాత్రమే
21 May 2023, 12:58 IST
- TS High Court On DOST Admissions:డిగ్రీ ప్రవేశాల ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ‘దోస్త్’తో సంబంధం లేకండానే దరఖాస్తు చేసుకోవడానికి 63 కాలేజీలకు అనుమతులు ఇచ్చింది.
డిగ్రీ ప్రవేశాలపై హైకోర్టు కీలక తీర్పు
DOST Admissions 2023: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. దోస్త్ సంబంధం లేకుండానే అడ్మిషన్లు నిర్వహించుకునేందుకు 63 కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలను ఆదేశిస్తూ విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది.
‘దోస్త్’ ప్రక్రియ ద్వారా ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ 63కు పైగా ప్రైవేటు కాలేజీలు వేసవి సెలవుల ప్రత్యేక హైకోర్టులో పిటిషన్‌లు దాఖలుచేశాయి. వీటిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ… చాలావరకు కాలేజీలు సొసైటీ కింద నమోదు చేసుకున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 2016-17 సంవత్సరంలో ప్రభుత్వం ఎలాంటి నిర్మాణాత్మక, కనీస సంప్రదింపులు జరపకుండా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా అడ్మిషన్‌లు ప్రారంభించిందని వాదించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తమతో సహా పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించగా ఆన్‌లైన్ ద్వారా కామన్ కౌన్సెలింగ్ నిర్వహించే అధికారం యూనివర్సిటీలకు లేదంటూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుత వాదనలతో పాటు గతంలో వచ్చిన ఉత్తర్వులను పరిశీలించిన ధర్మానసం… దోస్త్‌తో ప్రమేయం లేకుండా అడ్మిషన్‌లు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Degree Admissions 2023: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం గతావారమే ‘దోస్త్’ నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీ చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.
ముఖ్య తేదీలు
మే 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు
మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్స్
జూన్ 16వ తేదీన మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
జూన్ 16 నుంచి జూన్ 26 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
జూన్ 16 నుంచి జూన్ 27 వరకు రెండో విడత దోస్త్ ఆప్షన్లు
జూన్ 30వ తేదీన రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
జూలై 1 నుంచి 5 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు
జూలై ఒకటి నుంచి జూలై 6 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలి.
జూలై 10వ తేదీన మూడో విడత సీట్లు కేటాయించనున్నారు.
మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మొదటి విడతలో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.200 చెల్లించాలని ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఇక రెండు, మూడో విడతలో రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూలై 17 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు నిర్వహించనున్నారు. డిగ్రీ ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించాలి. ఇందులో Candidate Pre-Registrationతో రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత... Application Fee Paymentతో తగిన ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత Candidate Login ద్వారా ఆప్షన్లను ఎంచుకోవచ్చు.