TS CPGET 2023: గుడ్ న్యూస్... ఇకపై ఏ డిగ్రీ చేసినా ఎంకామ్‌లో ఛాన్స్! కొత్త మార్పులివే
13 May 2023, 10:15 IST
- TS Common Post Graduate Entrance Test 2023: తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈసారి అడ్మిషన్ల ప్రక్రియలో పలు మార్పులు చేసింది.
కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2023
TS CPGET 2023 Notification 2023: రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీగెట్-2023) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 12వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ఈ ఏడాది చేపట్టనున్న అడ్మిషన్ల ప్రక్రియలో కీలక మార్పులు చేసింది.
పలు కోర్సుల్లో ప్రవేశాల్లోనిబంధనలను సడలిస్తూ సంస్కరణలు తీసుకువచ్చారు సీపీగెట్ అధికారులు. ఆరు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలన్న నిబంధనను తాజాగా ఎత్తేశారు. మైక్రోబయాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఎన్విరాన్‌మెంట్ సైన్స్, బయో కెమిస్ట్రీ, న్యూట్రిషన్, డైటెటిక్స్ ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశానికి కెమిస్ట్రీని చదివి ఉండాలన్న నిబంధనను తొలగించారు. ఈ నిర్ణయంతో బీఎస్సీ (BZC), మైక్రోబయాలజీ, బయాలజీ, జువాలజీ వంటి కాంబినేషన్‌తో డిగ్రీ పూర్తిచేసిన వారు పైన పేర్కొన్న ఆరు సబ్జెక్టుల్లో చేరవచ్చు. తాజాగా డిగ్రీలో ఏ కోర్సు తీసుకున్న వారైనా ఎంకామ్(Mcom)లో అడ్మిషన్లు పొందవచ్చు. వీరు సీపీగెట్ ఎంట్రెన్స్ టెస్ట్ లో కామర్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు:
ఎంట్రెన్స్ పరీక్ష - కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్
నిర్వహించే వర్శిటీ - ఉస్మానియా వర్శిటీ
కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్లు - 12 -05 -2023.
దరఖాస్తులుకు చివరి తేదీ - 11 -06 -2023.
500 రూపాయల ఫైన్ తో దరఖాస్తు గడువు - 18 -06- 2023.
2000 రూపాయల ఫైన్ తో దరఖాస్తు గడువు -20 -06 -2023.
పరీక్షలు - జూన్ చివరి వారంలో జరిగే అవకాశం
పరీక్షల విధానం - కంప్యూటర్ ఆధారిత పరీక్షలు
అధికారిక వెబ్ సైట్లు - osmania.ac.in , cpget.tsche.ac.in, ouadmissions.com
2023-24లో ప్రవేశాల కోసం సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల కాగా… దాదాపు 300 కాలేజీల్లో అడ్మిషన్ల కోసం దాదాపు 45 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీపీగెట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. జూన్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుం రూ.500తో జూన్ 18వ తేదీ వరకు రూ.2 వేల ఆలస్య రుసుంతో జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పరీక్షలు జూన్ ఆఖరి వారం నుంచే జరిగే అవకాశం ఉంది. వచ్చే విద్యాసంవత్సరంలో వివిధ యూనివర్సిటీల్లో కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టారు.