DOST Admissions 2023 : నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఈ నెల 16 నుంచి జూన్ 10 వరకు సీట్ల భర్తీ
16 May 2023, 19:21 IST
- DOST Admissions 2023 : తెలంగాణ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అయింది. విద్యార్థులు దోస్త్ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు.
దోస్త్ అడ్మిషన్లు
DOST Admissions 2023 : తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్(డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. శాతవాహన యూనివర్సిటీలో ఈ నెల 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ తొలివిడత సీట్ల భర్తీ ప్రారంభం కానుంది. మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఖాళీగా ఉన్న డిగ్రీ సీట్లను జూన్ 16న కేటాయిస్తారు. తిరిగి జూన్ 16 నుంచి జూన్ 26 వరకు రెండో విడతలో సీట్ల భర్తీ చేపడతారు. జూన్ 30న సీట్ల కేటాయింపులు జరగనున్నాయి. జులై 1 నుంచి జులై 6 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, జులై 10న సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు. జులై 17వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.
శాతవాహన యూనివర్సిటీలో పరిధిలో
దోస్త్ రిజిస్ట్రేషన్ నేటి నుంచి ప్రారంభం అవ్వడంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల వివరాలను అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, భర్తీ అయిన సీట్లు, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనే వివరాలను సేకరించి నివేదికను రూపొందించారు. ఆ నివేదికను వీసీ ముందు ఉంచారు. వీసీ పరిశీలించిన అనంతరం ఆయా కాలేజీలకు కేటాయించిన సీట్లు ఇవాళ ప్రకటించనున్నారు. కరోనా దెబ్బతో చాలా ప్రైవేట్ కాలేజీ మూతపడ్డాయి. కాలేజీలను మూసివేసేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు అనుమతి కోరినట్లు సమాచారం.
అన్ని యూనివర్సిటీల పరిధిలో
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు దోస్త్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలలో అడ్మిషన్ పొందవచ్చు. విద్యార్థులు దోస్త్ ద్వారా సులభంగా అడ్మిషన్ పొందేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
ఇలా దరఖాస్తు చేసుకోండి
విద్యార్థులు ముందుగా తమ ఫోన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం https://dost.cgg.gov.in వెబ్ లైట్ లో లాగిన్ అయిన దోస్త్ ఐడీ, పిన్ నెంబర్ జనరేట్ చేసుకోవాలి. వీటితో అప్లికేషన్‌ను నింపాలి. దరఖాస్తులో కోర్సులు, కాలేజీల వారీగా ప్రాధాన్యతా వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. విద్యార్థులు పెట్టుకున్న కాలేజీలో సీటు వస్తే అక్కడికి వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. కౌన్సెలింగ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్లు సమర్పించి, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దోస్త్ సహాయ కేంద్రాలు
విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఎస్ఆర్ఆర్ కళాశాల, కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ సేవా కేంద్రాలను ఏర్పాటుచేశారు. విద్యార్థులు ఇక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో తప్పులు చేస్తే ఈ కేంద్రాల వద్ద సరిచేసుకోవచ్చు.