తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  1 Lakh For Minorities : మైనార్టీల‌కు కొత్త స్కీమ్... రూ. ల‌క్ష ఆర్థిక సాయం, రేపోమాపో ఉత్తర్వులు

1 Lakh For Minorities : మైనార్టీల‌కు కొత్త స్కీమ్... రూ. ల‌క్ష ఆర్థిక సాయం, రేపోమాపో ఉత్తర్వులు

20 July 2023, 17:43 IST

google News
    • Telangana Govt Latest News: త్వరలోనే మైనార్టీలకు కూడా రూ. లక్ష సాయం అందించబోతుంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. 
మంత్రి హరీశ్ రావ్ (ఫైల్ ఫొటో)
మంత్రి హరీశ్ రావ్ (ఫైల్ ఫొటో)

మంత్రి హరీశ్ రావ్ (ఫైల్ ఫొటో)

Minister Harishrao: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలతో పాటు ప్రజల కోసం పలు పథకాలను ప్రకటిస్తూ వస్తోంది. ఈ మధ్యనే బీసీ చేతి వృత్తి కులాలకు లక్ష సాయం స్కీమ్ ప్రకటించగా… త్వరలోనే మైనార్టీలకు కూడా లక్ష సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావ్ కీలక ప్రకటన చేశారు. రూ.లక్ష ఆర్థిక సహాయం అందించే పథకాన్ని మైనారిటీలకు కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని…. త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు.

గురువారం హైదరాబాద్ లో మాట్లాడిన మంత్రి హరీశ్ రావ్…. రాష్ట్రంలో ఉన్న నిరుపేద మైనార్టీలకు ప్రభుత్వం ఆర్థిక సాయం నిమిత్తం రూ. లక్ష అందిస్తుందన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా అర్హులైన మైనార్టీలకు ఈ సాయం అందజేస్తామని పేర్కొన్నారు. ఆర్థిక సాయంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఈ ఆర్థిక సాయంపై ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పుకొచ్చారు.

వైద్య సేవలపై సమీక్ష…

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో నిరంతర వైద్య సేవల కోసం రాష్ట్ర స్థాయిలో 24×7 కమాండ్ కంట్రోల్ సెంటర్ నంబర్- 040-24651119 ను ఏర్పాటు చేసినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావ్ తెలిపారు. గురువారం అధికారులతో సమీక్షించిన ఆయన… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశంచారు. సబ్ సెంటర్ స్థాయి నుండి హైదరాబాద్ లోని ప్రధాన ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని… ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలకై అవసరమైతే హెలికాప్టర్ సేవలు వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు.

“108, 102 వాహన సేవలు పూర్తి స్థాయిలో వినియోగించాలి. గర్బిణులను ఇంటి నుంచి ఆసుపత్రికి, ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చేందుకు అమ్మ ఒడి వాహన సేవలు వినియోగించాలి. కేసీఆర్ కిట్ డేటా ఆధారంగా గర్భిణుల డెలివరీ డేట్ ముందుగా తెలుసుకొని, వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలి. గర్భిణులు, డయాలసిస్ పేషెంట్లకు వైద్య సేవలు అందించే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థుల హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో ఆయా పరిధిలోని ఏ ఎన్ ఎం, మెడికల్ ఆఫీసర్ వెళ్లి సందర్శించాలి. ప్రాథమిక దశలోనే గుర్తించి, పరీక్షలు నిర్వహించి వైద్యం అందించాలి. ఆసుపత్రులు, వార్డులు, పరిసర ప్రాంతాల్లో శుభ్రత ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ లదే . జిల్లా, ఏరియా, సీహెచ్సీ, ఎంసీహెచ్ ఆసుపత్రుల వారీగా ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి.. పీహెచ్సీ స్థాయిలో పాము కాటు, తేలు కాటు మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలి. జీహెచ్ఎంసీ పరిధిలో తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత జిల్లాల పరిధి వైద్యాధికారుతో మాట్లాడాలి. బస్తీ దవాఖానలు పూర్తి స్థాయిలో పని చేయాలి, తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించి, తక్షణ వైద్య సేవలు అందించాలి” అని హరీశ్ రావ్ సూచించారు.

తదుపరి వ్యాసం