BRS Harish Rao : ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా ఛాన్స్... రికార్డులకు కేరాఫ్ 'హరీశ్ రావ్'-harish rao got a chance to become a minister without being an mla in politics ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Harish Rao : ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా ఛాన్స్... రికార్డులకు కేరాఫ్ 'హరీశ్ రావ్'

BRS Harish Rao : ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా ఛాన్స్... రికార్డులకు కేరాఫ్ 'హరీశ్ రావ్'

Mahendra Maheshwaram HT Telugu
Jul 12, 2023 11:16 AM IST

TS Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తిగా హరీశ్ రావ్ పేరుతో రికార్డు ఉంది. 2004 నుంచి సిద్ధిపేట ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్న ఆయన... ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన మెజార్టీపై అందరి చూపు పడే అవకాశం ఉంది.

సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావ్
సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావ్

Siddipet MLA Harish Rao: హరీశ్ రావ్.... ఈ పేరు వింటే వెంటనే గుర్తొచ్చేది సిద్ధిపేట...! సిద్ధిపేట పేరు వింటే కూడా హరీశ్ రావ్ అన్నట్లు ఉంటుంది సీన్...! ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైన అజెండాతో 2001లో టీఆర్ఎస్ స్థాపించారు కేసీఆర్. ఆయన మేనల్లుడైన హరీశ్ రావ్... కొద్దిరోజుల తర్వాత మేనమాన కేసీఆర్ అడుగులో అడుగులు వేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. ఎమ్మెల్యేగా గెలవకుండానే నేరుగా మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఆ తర్వాత ఉపఎన్నికల్లో గెలిచారు. ఇక టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు సంపాందించుకున్న ఆయన... టాస్క్ అప్పగిస్తే పూర్తి అయ్యేవరకు విశ్రమించని నేతగా పేరొందారు. సిద్ధిపేట నుంచి లక్షకుపై మెజార్టీతో సరికొత్త రికార్డు సృష్టించిన ఆయన... వచ్చే ఎన్నికల్లో మరోసారి విక్టరీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.

నేరుగా మంత్రిగా ఛాన్స్..

2001లో టీఆర్ఎస్ ఏర్పాటైంది. తెలంగాణ సాధనగా పోరాటం మొదలుపెట్టింది. అయితే 2004 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.... కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఇందులో భాగంగా... నాడు తెలుగుదేశం పార్టీ ఓటమిపాలు కాగా.... కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఆయన కేబినెట్ లో టీఆర్ఎస్ కు చెందిన పలువురికి మంత్రులుగా అవకాశం దక్కింది. ఇందులో హరీశ్ రావ్ ఒకరిగా ఉన్నారు. యువజన సర్వీసులు, ప్రింటింగ్‌ స్టేషనరీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... సిద్ధిపేట అసెంబ్లీ, కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆయన ఎంపీగానే కొనసాగాలని నిర్ణయించుకోవటంతో సిద్దిపేట స్థానాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ రావును అభ్యర్థిగా నిర్ణయించారు. ఇందులో 24,829 మెజార్టీతో విజయం సాధించారు. తద్వారా కొంతకాలం పాటు కేబినెట్ లో కొనసాగారు. మరోవైపు ఉద్యమంలో యాక్టివ్ అయిపోయారు. పార్టీలో కూడా కీలక నేతగా తయారయ్యారు. ఈ క్రమంలోనే... తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ వైఖరికి నిరసగా మంత్రిపదవులకు రాజీనామా చేసి బయటికి వచ్చారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై 58,935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు హరీశ్ రావ్. ఈ ఉపఎన్నికల్లో చాలా మంది టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన మెజార్టీని మరింత పెంచుకున్నారు హరీశ్ రావ్. ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ మరణించారు. మరోవైపు 14ఎఫ్ తో వివాదం మొదలైంది. ఇది కాస్త మలిదశ తెలంగాణ ఉద్యమానికి దారి తీసింది. కేసీఆర్ దీక్షకు దిగటంతో... ఉద్యమం తారా స్థాయికి చేరింది. ఇదే ఏడాది డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసింది. మరోవైపు ఆంధ్రా నేతలు రాజీనామాలు చేయటంతో... ప్రకటనను వెనక్కి తీసుకుంది కేంద్రం. ఇందులో భాగంగా... తెలంగాణలోని పలువురు రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు హరీశ్. 2009లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి పులివెందుల నియోజక వర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును తిరగరాసి సరికొత్త చరిత్రను సృష్టించారు.

హరీశ్ రావు ప్రస్థానం
హరీశ్ రావు ప్రస్థానం

భారీ మెజార్టీ....

రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోసిద్దిపేట నియోజకవర్గం నుంచి 93, 328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు హరీశ్ రావ్. తొలి మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఓ దశలో ఆయన్ను కాళేశ్వరరావుగా అభివర్ణించారు.ఇదే తరహా కామెంట్స్... నాటి గవర్నర్ నరసింహన్ కూడా చేశారు. మరోవైపు 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విక్టరీ కొట్టారు హరీశ్ రావ్. ఇదే దేశంలోనే అత్యధిక మెజార్టీగా ఉంది. మరోసారి కూడా కేసీఆర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఈటల రాజేందర్ పార్టీ మార్పు తర్వాత.... వైద్యారోగ్యశాఖ బాధ్యతలను కూడా హరీశ్ రావే చూస్తున్నారు.

ట్రబుల్ షూటర్ గా గుర్తింపు...

బీఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే హరీశ్ రావ్ కు ట్రబుల్ షూటర్ గా పేరింది. ఎక్కడైనా సమస్య ఉందంటే.... అక్కడ హరీశ్ ఎంట్రీ ఇస్తే పరిష్కారం అవుతుందని ఆ పార్టీలోని చాలా మంది చెబుతున్నారు. కీలకమైన టాస్క్ లను కూడా కేసీఆర్ ఆయనకే అప్పగిస్తారు. కేసీఆర్ తర్వాత... బీఆర్ఎస్ లో మంచి వాగ్ధాటి గల నేతగా హరీశ్ కు పేరుంది. గ్రామీణంలోని ప్రజలను ఆకర్షించేలా మాట్లాడటం హరీశ్ రావ్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఉద్యమ కాలంలో... చాలా అగ్రెసివ్ గా పని చేశారు. ఆంధ్రా నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యేవారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రతి విషయంలోనూ గ్రౌండ్ లోకి వెళ్లి పర్యవేక్షించి... ఓ అంచనాకు వస్తారన్న పేరు కూడా హరీశ్ రావ్ కు ఉంది. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎన్ని బాధ్యతలు ఉన్నా... నియోజకవర్గాన్ని మాత్రం చుట్టిముటేస్తారు హరీశ్ రావు. వారంలో మూడు రోజులు అక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటారన్న పేరు ఉంది. తెలంగాణలో అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా కూడా సిద్ధిపేట ఉంది. ఆ నియోజకవర్గ అభివృద్ధిలో హరీశ్ రావ్ తనదైన ముద్రవేశారనే చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రతి ఎన్నికల్లో ఆయన మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ఈసారి ఎంత మెజార్టీ వస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.

హరీశ్ రావ్ పొలిటికల్ కెరీర్
హరీశ్ రావ్ పొలిటికల్ కెరీర్

ఇక హరీశ్ రావుకు సంబంధించి కొన్ని విషయాల్లో ఆయన్ను టార్గెట్ చేస్తుంటారు ప్రతిపక్షాలు. కుటుంబ పాలన అంటూ ఆయనపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతుంటారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే... హరీశ్ రావు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యే వారని అంటుంటారు. అందులో భాగంగానే.... అప్పట్లో వైఎస్ఆర్ ను ప్రత్యేకంగా కలిశారని చెబుతుంటారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అరెస్ట్ ను ఖండిస్తూ సిద్ధిపేటలో దీక్షకు దిగే ప్రయత్నం చేశారు హరీశ్ రావ్. ఓ దశలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశారు. ఈ విషయంలో ఇప్పటికి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. పార్టీలో కేటీఆర్ వర్సెస్ హరీశ్ అన్నట్లు పరిస్థితి ఉందనే వార్తలు కొంతకాలం కిందట బాగా తెరపైకి వచ్చాయి. 2018 ఎన్నికల ఫలితాల తర్వాత.... కేటీఆర్ కు పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం దక్కటంతో... హరీశ్ రావ్ అసంతృప్తితో ఉన్నారనే చర్చ వినిపించింది. ఓ దశలో హరీశ్ రావ్ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ కూడా వినిపించింది. దాదాపు ఇచ్చిన అన్నిచోట్ల టాస్క్ లను విజయవంతంగా పూర్తి చేసిన హరీశ్... దుబ్బాక ఉపఎన్నికలో మాత్రం ఫెయిల్ అయ్యారనే చర్చ ఉంది. కీలకమైన ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రఘనందన్ గెలిచారు. ప్రస్తుతం మాత్రం... బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీశ్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. విబేధాలు లేకుండా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.

Siddipet MLA Harish Rao
Siddipet MLA Harish Rao

మొత్తంగా తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో మెజార్టీ పెంచుకుంటూ వస్తున్నారు హరీశ్ రావ్. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న ఆయన... కేసీఆర్ నిర్ణయమే తనకు శిరోధార్యమని పదే పదే చెబుతుంటారు. సిద్ధిపేట ప్రజల కోసం ఎంత చేసిన తక్కువేనని... తన చివరి శ్వాస వరకు కూడా ఇక్కడి ప్రజల కోసం పని చేస్తానని అంటుంటారు. అయితే మరికొద్దిరోజుల్లో రాబోయే ఎన్నికల్లో కూడా మరోసారి భారీ మెజార్టీ విజయఢంకా మోగించాలని హరీశ్ రావ్ భావిస్తున్నారు. హరీశ్ రావు శ్రీనితను వివాహమాడాడు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. హరీశ్ రావ్ పాలిటెక్నిక్ పూర్తి చేశారు. 30 ఏళ్లకే ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం