TG Lands Value Hike : తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల విలువ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు సిద్ధం?
12 August 2024, 15:20 IST
- TG Lands Value Hike : తెలంగాణలో భూముల విలువ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈ నెలఖారులో భూముల విలువ పెంపుపై అభ్యంతరాలు, అభిప్రాయలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో భూముల విలువ పెంపు అమల్లోకి రానున్నట్లు సమాచారం.
తెలంగాణలో భూముల విలువ పెంపు, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం?
TG Lands Value Hike : తెలంగాణలో భూముల విలువ పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. భూముల విలువ పెంపుపై ఈ నెలఖారులో ప్రజల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17లోగా దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో భూముల విలువ పెంపు అమల్లోకి తేనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూముల ధరలు 50 నుంచి 100 శాతం, వ్యవసాయేతర భూముల విలువ 15 శాతం పెరగనున్నట్లు సమాచారం.
ఈ నెలలోనే ఓ నిర్ణయం
ఏ భూముల విలువ ఎక్కడ, ఎంతమేర పెంచాలనే దానిపై ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై ఈ నెలాఖరులో అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించనుందని సమాచారం. ఆ తర్వాత భూముల విలువ పెంపుపై ప్రభుత్వంతుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. అలాగే పెంచిన భూముల విలువ అమలుపై ఈ నెల17లోగా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. గతంలో నిర్ణయించిన మేర ఈ నెల 1వ తేదీ నుంచి పెంచిన భూముల ధరలు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇటీవల రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు బదిలీ చేయడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. అలాగే బహిరంగ మార్కెట్ లో భూముల ధరలపై మరింతగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం భూముల విలువ పెంచనున్నట్టు ప్రకటించడంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి.
వాస్తవ, మార్కెట్ విలువల్లో వ్యత్యాసాలు
రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వసతులు ఉన్న భూముల ధరలు ఎకరం రూ.30-రూ.40 లక్షల వరకు పలుకుతున్నాయి. సాగునీటి సదుపాయం లేని చోట్ల భూముల ధరలు ఎకరం రూ.15 -రూ.20 లక్షల వరకు ఉన్నాయి. అయితే ప్రభుత్వం లెక్కల ప్రకారం... వీటి విలువ మాత్రం రూ.16 వేల నుంచి రూ.2 లక్షల వరకు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ధరలు, బహిరంగ మార్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భూముల విలువను పెంచేందుకు నిర్ణయించింది. హైవేలు, రోడ్ల పక్కన ఉన్న వ్యవసాయ భూములు పలు చోట్ల ఎకరం రూ.కోటి వరకు పలుకుతుంది. దీంతో వ్యవసాయ భూముల విలువ భారీగా పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ప్లాట్ల విలువను 15 శాతం వరకు పెంచనున్నట్టు తెలుస్తోంది.
గత ప్రభుత్వంలో
బీఆర్ఎస్ సర్కార్ 2021, 2022లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువను వరుసగా పెంచింది. గతంలో బహిరంగ మార్కెట్ లో ధరలను బట్టి 30 నుంచి 50 శాతం పెంచారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వాస్తవ, మార్కెట్ విలువల మధ్య భారీ తేడాలు లేకుండా చూడాలని, ఈ మేరకు భూముల విలువ పెంచాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే కలెక్టర్ల కమిటీ మార్కెట్ విలువలను అధ్యయనం చేసి, భూముల విలువ ప్రతిపాదనలు రూపొందించింది. భూముల విలువ పెంపుపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సైతం క్షేత్రస్థాయి అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. రాష్ట్రంలోని సరాసరిగా 30 నుంచి 50 శాతం మేర భూముల విలువ పెరిగే అవకాశం ఉందని సమాచారం.