HMDA Mokila Lands Auction : మోకిలలో మరోసారి భూముల విక్రయం, 300 ప్లాట్లు అమ్మకానికి సిద్ధం
14 August 2023, 16:45 IST
- HMDA Mokila Lands Auction : రంగారెడ్డి జిల్లా మోకిలలో మరోసారి స్థలాల విక్రయానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది.
మోకిల భూముల ఈ-వేలం
HMDA Mokila Lands Auction : హైదరాబాద్ లో మరో భారీ భూవేలానికి హెచ్ఎండీఏ సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా మోకిలలో రెండో విడత స్థలాల విక్రయాలకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. మోకిలలో మొత్తంగా 300 ప్లాట్లలో 98,975 గజాలను విక్రయించనున్నారు. ఈ 300 ప్లాట్ల అమ్మకంతో ప్రభుత్వానికి రూ.800 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. మోకిల లేఅవుట్‌లో 300 నుంచి 500 గజాల వరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని హెచ్ఎండీఏ తెలిపింది. ఈ-వేలంలో పాల్గొనేందుకు నేటి నుంచి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.1,180 చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌తో పాటు రూ.లక్ష డిపాజిట్ చేయాలని హెచ్ఎండీఏ తెలిపింది. చదరపు గజానికి రూ.25 వేలు కనీస ధరగా నిర్ణయించినట్లు ప్రకటించింది. మోకిల మొదటి ఫేజ్ వేలంలో గజానికి గరిష్ఠంగా రూ.1.05 లక్షలు, కనిష్ఠంగా రూ.72 వేలు పలికింది.
ముఖ్యమైన తేదీలు
- ఆగస్టు 14 - రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఆగస్టు 17- ప్రీ బిడ్డింగ్ మీటింగ్(లేఅవుట్ వద్ద)
- ఆగస్టు 21 - రిజిస్ట్రేషన్, అమౌంట్ డిపాజిట్ కు చివరి తేదీ
- ఆగస్టు 23 - ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు 30 ప్లాట్లు ఈ-వేలం
- ఆగస్టు 24 - మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 30 ప్లాట్లు ఈ-వేలం
- ఆగస్టు 25, 28, 29 తేదీల్లో- రెండు సెషన్లలో రోజుకు 60 ప్లాట్లు చొప్పున ఈ-వేలం
మూడు జిల్లాల పరిధిలో స్థలాల విక్రయాలు
హైదరాబాద్ పరిధిలో మరోసారి భూముల ఈ-వేలానికి హెచ్ఎండీఏ రంగం సిద్ధం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల అమ్మకానికి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డిలోని బైరాగిగూడ, మంచిరేవుల, పీరంచెరువు, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్, చందానగర్ లో హెచ్ఎండీఏ స్థలాలు విక్రయించనున్నారు. మేడ్చల్-మల్కాజ్‌గిరిలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం, సంగారెడ్డిలో వెలిమల, నందిగామ, అమీన్‌పూర్,రామేశ్వరం బండ, పతిఘనపూర్, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లోని స్థలాలు విక్రయించనున్నారు. ఈ ప్రాంతాల్లో రామేశ్వరం బండ, నందిగామలో చదరపు గజానికి కనీస ధర రూ.12వేలు, కోకాపేట, నల్లగండ్లలో గరిష్ఠంగా రూ.65 వేలుగా నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో ప్లాట్ల విస్తీర్ణం 302 చదరపు గజాల నుంచి 8,591 చదరపు గజాల వరకు ఉన్నాయి. ఈ-వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని హెచ్ఎండీఏ తెలిపింది. రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ ఆగస్టు 16 కాగా, ఈ నెల 18 నుంచి ఈ-వేలం నిర్వహించనున్నారు. స్థలాల విక్రయంపై పూర్తి వివరాలను హెచ్ఎండీఏ అధికారిక వెబ్‌సైట్ https://www.hmda.gov.in/auctions/లో తెలుసుకోవచ్చు.