Telangana : రేవంత్ సర్కార్ కు ఏడాది! రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన - విజయోత్సవాలు' - 3 జిల్లాల్లో సభలు, పూర్తి వివరాలివే
15 November 2024, 12:50 IST
- TG Govt Praja Palana Vijayotsvalu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో వేడుకలకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. “ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ” పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. 3 జిల్లాల్లో సభలు నిర్వహించనున్నారు.
ప్రజా పాలన-విజయోత్సవాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష
ప్రజా పాలన-విజయోత్సవాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో చేపట్టనున్న “ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ” కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం భట్టితో పాటు పలువురు మంత్రులతో కలిసి సమీక్షించారు.
ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి డిసెంబర్ 9 వరకు చేపట్టనున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందున వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు.
కార్యక్రమాల వివరాలు…
- ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మూడు ప్రాంతాలు వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు.
- మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్‌మెంట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతారు.
- నవంబర్ 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.
- డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్‌రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తారు.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆహ్వానం ఉంటుంది.
- ఈ విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు, కార్యక్రమాలపై శాఖలు, విభాగాల వారిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.