Maoist Surrender: మావోయిస్టు పార్టీ కీలక నేత లొంగుబాటు, 20 లక్షల రివార్డు అందజేసిన వరంగల్ పోలీసులు
Maoist Surrender: మావోయిస్టు పార్టీ కీలక నేత, పార్టీ మిలటరీ ఇంచార్జి మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ తో కలిసి పని చేసిన మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్న మంజుల అలియాస్ నిర్మల పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనారోగ్యంతో దళాన్ని వీడిన ఆమె వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝ ఎదుట లొంగిపోయారు.
Maoist Surrender: అనారోగ్య కారణాలతో పోలీసుల ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టుకు పోలీసులు ఆమె పేరిట ఉన్న రివార్డును ఆమెకు అందించారు.దీంతో 30 ఆమె 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి తెర పడినట్లయింది. లొంగుబాటుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ గురువారం వెల్లడించారు.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన కోడి మంజుల అలియాస్ నిర్మల తండ్రి గతంలో పీపుల్స్ వార్ దళానికి సానుభూతిపరుడిగా పనిచేశాడు. ఆమె అన్నయ్య కోడి కుమార స్వామి అలియాస్ ఆనంద్, దగ్గర బంధువు కోడి వెంకన్న అలియాస్ గోపన్న నర్సంపేట దళ కమాండర్‌గా పని చేసి ఎదురుకాల్పుల్లో మరణించారు. వారి స్ఫూర్తితో పాటు, పీపుల్స్ వార్ సిద్దాంతాలకు ప్రభావితమైన కోడి మంజుల పదో తరగతి చదువుతున్న సమయంలో 1994 సంవత్సరం జనవరి నెలలో సిపిఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ గ్రూప్ నర్సంపేట దళంలో చేరింది.
దళంలోనే పెళ్లి…
దళంలో పని చేసిన కోడి మంజుల 1996 సంవత్సరంలో చేర్యాల దళం పని చేసింది. 1999 సంవత్సరంలో నర్సంపేట దళ కమాండర్ పేరం బుచ్చయ్య అలియాస్ సురేందర్‌ను వివాహం చేసుకుంది. ఇదే సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టిన మంజుల భర్త సురేందర్.. 2000 సంవత్సరంలో పోలీసుల ఏదుట లొంగిపోయాడు.
2001లో మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ సారధ్యంలో ప్రెస్ టీం ప్రోటెక్షన్ ప్లాటూన్‌లో ఒక సంవత్సర కాలం పని చేసింది. 2002లో మహదేవపూర్ డిప్యూటీ దళ కమాండర్‌గా పనిచేసిన డివిజినల్ కమిటీ మెంబర్ కూకటి వెంకటి అలియాస్ రమేష్ ను పెళ్లి చేసుకుంది.
జైలుకు వెళ్లొచ్చి మళ్లీ దళంలోకి..
మంజుల 2002 డిసెంబర్ లో అనారోగ్యానికి గురి కాగా.. వైద్యం కోసం మరో దళ సభ్యురాలితో కల్సి భూపాలపల్లి ప్రాంతానికి వచ్చి పోలీసులకు చిక్కింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2004లో జైలు నుంచి విడుదలైన మంజుల పీపుల్స్‌వార్ గ్రూప్‌తో సంబంధాలు కొనసాగిస్తూ మళ్లీ ఆజ్ఞాతంలోకి వెళ్లింది.
మహదేవపూర్ దళ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టి 2005లో మహదేవపూర్, చేర్యాల, మహరాష్ట్ర సిరోంచ డిప్యూటీ కమాండర్‌గా పనిచేసింది. 2007లో మణుగూరు దళకమాండర్‌గా పని చేస్తున్న మంజుల మావోయిస్టు పార్టీ ఆదేశాల మేరకు దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలో ఏరియా కార్యదర్శి, వైద్య బృందానికి బాధ్యురాలిగా 2011 వరకు కొనసాగింది. 2012లో దర్బా డివిజనల్ కమిటీ సభ్యురాలిగా, 2017లో బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యురాలిగా బదిలీ అయింది. మెబైల్ పొలిటికల్ స్కూల్ బాధ్యురాలిగా పని చేసి 2022లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా నియామకమైంది.
వివిధ ఘటనల్లో కీలక పాత్ర
కోడి మంజుల తెలంగాణ, ఛత్తీస్‌గడ్ ప్రాంతాల్లో జరిగిన పలు ఘటనల్లో కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా 2013 సంవత్సరంలో దర్బా డివిజన్ పరిధిలోని జీరంఘాటి ప్రాంతంలో పోలీసులపై మావోయిస్టులతో కల్సి చేసిన దాడి చేసి 27 మంది పోలీసులను హతమార్చిన ఘటనతో పాటు చిట్యాల, నర్సంపేట, ఏటూరు నాగారం, నెక్కొండ స్టేషన్ల పరిధిలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో కూడా కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు తెలిపారు.
అనారోగ్యంతో జన జీవన స్రవంతిలోకి..
2021 సంవత్సరంలో కొవిడ్ బారిన పడిన మంజులకు ఆ తర్వాత పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఉద్యమంలో పాల్గొనేందుకు శరీరం సహకరించకపొవడంతో లొంగి పోయేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ ఎదుట లొంగిపోయింది. దీంతో ఆమెపై ఉన్న 20 లక్షల రూపాయల రివార్డు చెక్కును పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మంజులకు అందజేశారు.