Cyber Criminals: ముగ్గురు సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసిన మెట్ పల్లి పోలీసులు, మరో ఇద్దరి పరారీ-metpally police arrested three cyber criminals two others are absconding ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cyber Criminals: ముగ్గురు సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసిన మెట్ పల్లి పోలీసులు, మరో ఇద్దరి పరారీ

Cyber Criminals: ముగ్గురు సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసిన మెట్ పల్లి పోలీసులు, మరో ఇద్దరి పరారీ

HT Telugu Desk HT Telugu
Nov 15, 2024 05:39 AM IST

Cyber Criminals: సైబర్ నేరగాళ్ళ ఆటపట్టించారు జగిత్యాల జిల్లా పోలీసులు. బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ పేరుతో మోసం చేసే ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.‌ పట్టుబడ్డ వారి నుంచి 15 బ్యాంక్ ఖాతా లు, 20 డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులు, స్వాధీనం చేసుకున్నారు.

సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేసిన మెట్‌పల్లి పోలీసులు
సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేసిన మెట్‌పల్లి పోలీసులు

Cyber Criminals: సైబర్‌ నేరగాళ్ళ ముఠాను మెట్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ ముగ్గురు,పరారీలో ఉన్న ఇద్దరు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ చెందిన వారే.జగిత్యాల జిల్లా మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్ కు చెందిన సుమేశ్ కపూర్ (36), హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రాజీవ్ సింగ్(36), జతిందర్ కుమార్(37) తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని పథకం వేశారు.

సుమేష్ కపూర్ వివిధ బ్యాంకుల్లో బ్రోకర్ గా పనిచేసిన అనుభవం ఉండగా, రెండవ నిందితుడు రాజీవ్ సింగ్, మూడవ నిందితుడు జతిందర్ కుమార్ పంజాబ్ రాష్ట్రంలోని చండీగర్ నందు ఆసియన్ న్యూట్రిషన్( కోళ్ళ ఫారం) కంపనీ నందు సేల్స్ మేనేజర్, మేనేజర్ గా పని చేసేవారు.

ఈ ముగ్గురు వారు చేసే పని వళ్ళ వచ్చే ఆదాయం వారి జల్సాలకు సరిపోక పోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. వారికి పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో గల యూనియన్ బ్యాంకు నందు పనిచేసే అర్జున్ చౌహాన్(36)తో పరిచయం ఏర్పడింది.

అర్జున్ చౌహాన్ ఆ ముగ్గురికి మేము దేశవ్యాప్తంగా ప్రజలని బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం చేసి వారి బ్యాంకు ఖాతాల నుండి డబ్బులని వేరే బ్యాంకు ఖాతా లకి మళ్ళించి, వాటిని వేరే దేశానికి పంపిస్తాం.. అందుకు కావలసిన బ్యాంకు ఖాతాలని మీరు సమకూర్చితే, అట్టి ఖాతాలో ప్రజలని మోసం చేయగా జమ అయే డబ్బుల నుండి (2%) కమిషన్ గా డబ్బులు ఇస్తామని చెప్పాడు. ముగ్గురు నిందితులు అందుకు ఒప్పుకుని, సుమేష్ కపూర్ తన పేరిట JB CONSTRUCTION COMPANY పేరు మీద YES బ్యాంకు నందు కరెంటు ఖాతా తీశాడు.

సైబర్ నేరగాళ్ళకు చిక్కిన మెట్ పల్లి వైద్యుడు

మోసపూరితంగా బ్యాంక్ ఎంప్లాయిస్ తో కలిసి ముగ్గురు నిందితులు స్టాక్ మార్కెట్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ సైబర్ మోసాలకు తెరలేపారు. వారి మోసాలకు మెట్ పల్లి కి చెందిన వైద్యుడు చిక్కాడు. అత్యాశకు పోయిన డాక్టర్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని ఇంస్టాగ్రామ్ లో ఒక లింక్ ఓపెన్ చేయగా వాట్సప్ నెంబర్ ద్వారా మెసేజ్ పంపించారు.

మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే AC MAX అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని, Accel student group 95 లో చేరండి అని లింక్ పంపించడంతో డాక్టర్ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్ ను ఫాలో అవుతూ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు.

ఫస్ట్ 50 వేల రూపాయలు తర్వాత మరుసటి రోజు మరో 50 వేలు రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ఒక్కొక్కసారిగా ఒక్కొక్క కొత్త అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశాడు. 22 లక్షల రూపాయలు నెట్ బ్యాంకింగ్ ద్వారా సంబంధిత అకౌంట్ లకు జమ చేశాడు. సైబర్ నేరగాళ్లు IP0 ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని తెలుపగా బాధితుడు నా దగ్గర డబ్బులు లేవు.. చేయలేనని తెలపడంతో 150 సబ్స్క్రియిట్ చేయలేని సందర్భంలో మీ యొక్క క్రెడిట్ స్కోర్ పడిపోతుందని మీరు ఫ్లైట్, ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోలేరని భయపెట్టారు.

సైబర్ మోసగాళ్లకు భయపడి 20 లక్షల రూపాయలను బజాజ్ ఫైనాన్స్ లోన్ తీసుకుని మరో 5 లక్షల రూపాయలు అప్పు చేసి మొత్తంగా 25 లక్షల రూపాయలు, యాప్ లో ఉన్న 25 లక్షలతో కలిపి 50 లక్షలు రూపాయలతో IPO సబ్స్క్రయిబ్ చేశాడు. ఐపీఓ లో లాభాలు పెరిగి మొత్తంగా 1.27 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని మీరు మళ్ళీ ఇంకొక ఐపిఓ సబ్స్కయిబ్ చేసుకోవాలని కోరగా తన దగ్గర అంత డబ్బు లేదని నా అమౌంట్ విత్ డ్రా చేస్తానని చెప్పగా అలా అయితే మీరు మా మాట వినడం లేదు..ఈ గ్రూప్ నుండి వెళ్ళాలని ఆదేశించారు.

వెళ్ళే ముందు 20 శాతం సర్వీస్ ఫీజు ఫర్ ప్రాఫిట్ 15,08,000 కట్టి వెళ్ళండి అన్నారు. బాధితుడు సరే అని అమౌంట్ కట్టిన తర్వాత 15% ప్రాఫిట్ టాక్స్ 11,30,802 రూపాయలు కట్టమన్నారు. కట్టిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఉన్న రూపాయలను విత్ డ్రా చేయాలంటే 25% TAX అంటే 31 లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పడంతో నా వల్ల కాదు అని డాక్టర్ విన్నవించాడు. అంత డబ్బు కడితేనే విత్ డ్రా చేస్తాం లేకుంటే డబ్బులు రావని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన డాక్టర్ 1930 కు కాల్ చేశాడు.

తీగలాగితే డొంక కదిలింది…

మెట్ పల్లి కి చెందిన వైద్యుడు స్టాక్ మార్కెట్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ళు చిక్కి 69 లక్షల రూపాయలు పోగొట్టుకున్నానని పిర్యాదు చేయడంతో మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శికాగోయల్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో ఏడుగురు స్పెషల్ టీమ్ పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

స్టాక్ మార్కెట్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసానికి పాల్పడిన నిందితులకు చెందిన బ్యాంక్ ఖాతాలను గుర్తించి నిందితుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి, అందులో వైద్యుడి కి చెందిన పది లక్షల రూపాయలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్, జలంధర్ లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి పక్క ప్రణాళికతో ఈనెల 11న పంజాబ్ రాష్ట్రం లోని జలంధర్ లో A1 ఇంటి వద్ద ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుండి నేరం చేయడానికి ఉపయోగించిన వివిధ బ్యాంకు ఖాతా పుస్తకాలు (15), చెక్ బుక్ (10), డెబిట్ & క్రెడిట్ కార్డు(20), మొబైల్ ఫోన్(3), ల్యాప్ టాప్స్ (2), సిమ్ కార్డ్స్ (14), మొదలగు వాటిని వారి వద్ద నుండి సీజ్ చేసి జలంధర్ లోని కోర్ట్ లో హాజరు పరిచి ట్రాన్సిట్ వారంట్ మీద మెట్ పల్లి కి తీసుకవచ్చి విచారించి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించామని ప్రకటించారు.

పరారీలో ఉన్న మిగతా నిందితులను పట్టుకోవడాని పోలీస్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. మెట్ పల్లి కోర్టు ఉత్తర్వులతో సంబంధిత నిందితుని బ్యాంకు ఖాతా నుండి వైద్యుడికి రీఫండ్ చేయించడం జరిగిందని, మరో 24 లక్షలను నిందితుని ఖాతా లలో గుర్తించి వాటిని ఫ్రీజ్ చేసి, కోర్ట్ ఉత్తర్వుల మేరకు భాదితునికి రీఫండ్ చేయడానికి ప్రాసెస్ జరుగుతుందని తెలిపారు.

మోసం ఇలా…

ముందుగా డాక్టర్ 24 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. డాక్టర్ డబ్బులు సుమేష్ కపూర్ ఖాతాలో జమ కాగానే నిందితుడు A-4 అర్జున్ చౌహాన్ సూచన మేరకు 24 లక్షల రూపాయలను A-2 A-3 రాజీవ్ సింగ్, జతిందర్, A-1 సుమేష్ కపూర్ బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బులు విత్ డ్రా చేసి వేరే దేశంలో ఉండే నిందితుడు (A-5) రాజ్ అనే వ్యక్తికి పంపించారు. అందుకు గాను నిందితుడు (A-5) 2 లక్షల రూపాయలు ముగ్గురు నిందితులకు కమిషన్ రూపంలో ఇవ్వగా వారు అట్టి డబ్బులను అవసరాలకు వాడుకున్నారు.

ఈ విధంగా నిందితులు దేశ వ్యాప్తంగా చాల మంది ప్రజలను బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరు తో సైబర్ మోసం చేస్తూ ముగ్గురు నిందితులు దుబాయిలోని ఓ ముఠా ద్వారా ట్రాన్జాక్షన్ చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులు సైబర్ నేరాల పరిభాషలో మ్యుల్స్ (కమిషన్ కొరకు బ్యాంకు ఖాతాలు సమకూర్చే వారు) గా పిలుస్తారు.

ఫేక్ ట్రేడింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఫేక్ ట్రేడింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ట్రేడింగ్ యాప్ లైసెన్స్, రెగ్యులేషన్ల వివరాలను తెలుసుకొని ట్రేడింగ్ చేయాలని కోరారు. అధిక లాబాలతో కూడిన మార్కెట్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ కు దూరంగా ఉండాలన్నారు. ట్రేడింగ్ చేసే యాప్ ల యూజర్ రివ్యూలు రేటింగ్ లను చదవాలి.

  • అనుచిత ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి..ఊహించని పెట్టుబడుల పట్ల జాగ్రత్త వహించాలి.
  • తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.
  • సోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కావచ్చు.
  • ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయడం లేదా NCRP పోర్టల్ https://cybercrime.gov.in/ లో ఫిర్యాదు చెయ్యండి.

తీసుకోవలసిన జాగ్రత్తలు

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయడం లేదా NCRP పోర్టల్ https://cybercrime.gov.in/

మీకు లాటరి, లోన్ వచ్చిందని, కాల్ గాని మెసెజ్ గాని వచ్చిందా? ఆశపడకండి, అనుమానించండి.

అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి, మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు

వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.

తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.

మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసీజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.

ఇంస్టాగ్రామ్ లో మీకు తెలిసిన వ్యక్తి ఫోటో వుండి మిమ్మల్ని డబ్బులు పంపమని అడుగుతున్నాడా? మరి ఆ మెసేజి మీకు తెలిసిన వ్యక్తి పంపాడా? తెలుసుకోండి, మోసపోకండి.

మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner