CBSE : సీబీఎస్ఈ క్లాస్ 10, 12 సిలబస్ 15శాతం తగ్గిందా? అసలు నిజం ఇదే..
CBSE board exams : 10, 12వ తరగతి పరీక్షల సిలబస్ ను 15 శాతం తగ్గిస్తున్నట్లు వస్తున్న వార్తలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ ఈ) తోసిపుచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్‌ని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు..
సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 సిలబస్ విషయంలో ఇటీవల గందరగోళం నెలకొంది. రెండు తరగతుల సిలబస్‌ని 15శాతం మేర తగ్గిస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుందని గురువారం వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఎంపిక చేసిన సబ్జెక్ట్స్‌లో ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు పలు నివేదికలు చెప్పాయి. ఈ వ్యవహారంపై సీబీఎస్ఈ తాజాగా స్పందించింది. అవన్నీ ఫేక్ అని, తాము ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. 2025 బోర్డు పరీక్షల కోసం 10, 12 తరగతుల సిలబస్‌ని తగ్గించాలని, ఎంపిక చేసిన సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పింది.
ఇదీ జరిగింది..
విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే క్రమంలో సిలబస్‌ని కట్ చేసేందుకు సీబీఎస్ఈ ప్రయత్నిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే తాము అలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి వార్తలు నిరాధారమైనవని బోర్డు తెలిపింది.
“మూల్యాంకన వ్యవస్థ లేదా పరీక్షా విధానంలో బోర్డు అటువంటి నోటీసును జారీ చేయలేదు. ఎటువంటి మార్పులు చేయలేదు. బోర్డు విధాన నిర్ణయాలకు సంబంధించిన సమాచారం బోర్డు అధికారిక వెబ్సైట్ లేదా అధీకృత మార్గాల ద్వారా మాత్రమే ప్రచురిస్తాము,” అని సీబీఎస్ఈ తెలిపింది.
సీబీఎస్ఈ తన పరీక్షా విధానం లేదా అంతర్గత మూల్యాంకన వ్యవస్థలో ఎటువంటి మార్పులు చేయలేదని, దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ జారీ చేయలేదని స్పష్టం చేసింది.
కఠినంగా వ్యవహరిస్తున్న సీబీఎస్ఈ..
మరోవైపు ఈ నెల ప్రారంభంలో, సీబీఎస్ఈ 21 పాఠశాలల అఫిలియేషన్‌ని ఉపసంహరించుకుంది. సెప్టెంబర్‌లో రాజస్థాన్, దిల్లీలోని పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన తరువాత ఆరు స్కూళ్లను సీనియర్ సెకండరీ స్థాయి నుంచి సెకండరీ స్థాయికి డౌన్‌గ్రేడ్ చేసింది.
అఫిలియేషన్ ఉపసంహరించుకున్న 21 పాఠశాలల్లో 16 దిల్లీలో ఉండగా, ఐదు కోచింగ్ కేంద్రాలు కోటా, సికార్‌లో ఉన్నాయి.
“డమ్మీ లేదా హాజరుకాని అడ్మిషన్ల విధానం పాఠశాల విద్య ప్రధాన లక్ష్యానికి విరుద్ధంగా ఉంటుంది. ఇది విద్యార్థుల పునాది, ఎదుగుదలకు విఘాతం కలిగిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, డమ్మీ పాఠశాలల వ్యాప్తిని ఎదుర్కోవటానికి మేము నిర్ణయాత్మక చర్య తీసుకుంటున్నాము. డమ్మీ లేదా హాజరుకాని ప్రవేశాలను అంగీకరించే ప్రలోభాన్ని ప్రతిఘటించడానికి అన్ని అనుబంధ సంస్థలకు స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నాము,” అని సీబీఎస్ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా అన్నారు.
తనిఖీల్లో గమనించిన అవకతవకలకు సంబంధించి ఆకస్మిక తనిఖీ కమిటీల కీలక పరిశీలనలను.. సంబంధిత పాఠశాలలకు నివేదికగా తెలియజేశామని ఆయన తెలిపారు.
డమ్మీ విద్యార్థులు, అనర్హుల నమోదు కోసం సీబీఎస్ఈ ఈ ఏడాది ప్రారంభంలో 20 పాఠశాలల అఫిలియేషన్‌ని రద్దు చేసింది.
సంబంధిత కథనం