Bear Attack: ఎలుగుబంటి హల్ చల్... మహిళపై దాడి..తరిమికొట్టిన స్థానికులు
Bear Attack: కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. పంట పొలాల్లో మహిళపై దాడి చేసింది. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించి..పంట పొలాల్లో దాక్కున్న ఎలుగుబంటిని గ్రామస్థులు తరిమికొట్టారు.
Bear Attack: వనంలో ఉండాల్సిన వన్య ప్రాణులు జనంలోకి వస్తున్నాయి. జనాలపై దాడులకు తెగబడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిత్య కృత్యంగా మారింది. తాజాగా హుజూరాబాద్ మండలం కాట్రపల్లిలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. పంట పొలాల్లోకి వచ్చిన భల్లుకం గ్రామస్థులు భయాందోళనకు గురి చేసింది.
పత్తి ఏరుతున్న మహిళ గంగాధర వనమ్మ ఫై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడి చేరుకుని కర్రలు చేతబూని ఎలుగుబంటిని తరిమికొట్టారు. గాయపడ్డ మహిళను హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వనమ్మ కోలుకుంటున్నారు.
చేనులో దాక్కుని పారిపోయిన భల్లుకం
మహిళపై ఎలుగుబంటి దాడితో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటన స్థలానికి చేరుకుని ఎలుగుబంటి గురించి ఆరా తీశారు. మొక్కజొన్న చేనులో దాక్కున్న ఎలుగుబంటిని గుర్తించారు. స్థానికులు కర్రలు చేతబూని అరవడంతో ఎలుగుబంటి సమీప గుట్టల్లోకి పారిపోయింది.
అప్రమత్తంగా ఉండాలి..
ఎలుగుబంటి సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు గ్రామస్థులను అప్రమత్తం చేశారు. ఒంటరిగా ఎవరు వెళ్ళవద్దని పంట పొలాలకు వెళ్ళేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లత కోరారు. ఎలుగుబంటి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. జనవాసాల్లోకి ఎలుగుబంటి వస్తే వెంటనే సమాచారం ఇస్తే పట్టుకొని ఫారెస్ట్ లో వదిలిపెడతామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
వన్యప్రాణుల ఆవాసాలు ఆక్రమణ
వన్యప్రాణుల ఆవాసాలను జనం ఆక్రమించడంతోనే వన్య ప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందలాది గుట్టలపై గ్రానైట్ మాఫియా కన్నుపడడంతో కొండలన్ని పిండిగా మారి కరిగిపోతున్నాయి. బ్లాస్టింగ్ తో గుట్టల్లో కొండల్లో తల దాచుకున్న భల్లుకాలు భయాందోళనకు గురై జనవాసాల్లోకి వచ్చి ప్రజలపై దాడులకు తెగపడుతున్నాయి. గడిచిన నెల రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు చోట్ల ఎలుగుబంట్లు దాడులు చేశాయి. జనారణ్యంలోకి ఎలుగుబంట్లు వన్యప్రాణులు రాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి వన్యప్రాణులు కోసం స్పెషల్ జోన్ ఏర్పాటు చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)