Hydra : హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు మంజూరు.. తెలంగాణ సర్కారు ఉత్తర్వులు
03 December 2024, 16:11 IST
- Hydra : హైడ్రాకు రేవంత్ సర్కారు సపోర్ట్ పెంచింది. ఇన్నాళ్లు విశేష అధికారాలు ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా భారీగా నిధులు కేటాయించింది. దీనిపై హైడ్రా అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు హైదరాబాద్ నగరంలో హైడ్రా ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. హైడ్రా చీఫ్ రంగనాథ్ చిత్రపటానికి ప్రజలు పాలాభిషేకం చేశారు.
హైడ్రా చీఫ్ రంగనాథ్
హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. నిధులు మంజూరు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా ఆఫీసు నిర్వహణ, వాహనాల కొనుగోలు.. కూల్చివేతల చెల్లింపుల కోసం రూ.50 కోట్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. హైడ్రాకు నిధుల కేటాయింపుపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైడ్రా దూకుడు..
బడంగ్‌పేట కార్పొరేషన్‌లో పార్కులను ఆక్రమించిన అక్రమార్కులపై హైడ్రా కొరడా ఝులిపించింది. అల్మాస్‌గూడ 5వ డివిజన్‌లోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి ఒకరు కంటైనర్ ఏర్పాటు చేశారు. ఈ విషయంపై కాలనీ వాసులు రెండ్రోజుల కిందట మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్డ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి తెచ్చారు.
అంతకు ముందు కమిషనర్, హైడ్రా, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. హైడ్రా, పోలీస్, మున్సిపల్ ఉన్నతాధికారులతో లక్ష్మారెడ్డి మాట్లాడారు. భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున హైడ్రా, మీర్‌పేట్ పోలీసులు సంయుక్తంగా పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్‌ను ధ్వంసం చేశారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను ఏర్పాటు చేశారు. కబ్జాకు గురైన పార్కు స్థలాలపై ఫిర్యాదులు అందాయని.. త్వరలో వాటిపైనా చర్యలు తీసుకుంటామని హైడ్రా ఇన్స్‌పెక్టర్ స్పష్టం చేశారు.
పాలాభిషేకం..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసులు పాలాభిషేకం చేశారు. బడంగ్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో కబ్జాకు గురైన పార్కును హైడ్రా కాపాడిందని కాలనీ వాసులు చెబుతున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన 2 రోజుల్లోనే తమకు న్యాయం జరిగిందంటూ.. పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు కృతజ్ఞతలు చెప్పారు.