BRS Leaders Joins Congress : కేటీఆర్ ఇలాకలో బీఆర్ఎస్ కు షాక్- కాంగ్రెస్ లో చేరిన జడ్పీటీసీ, 8 మంది సర్పంచ్ లు
30 January 2024, 20:41 IST
- BRS Leaders Joins Congress :కేటీఆర్ ఇలాకలో బీఆర్ఎస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జడ్పీటీసీతో సహా 8 గ్రామాల సర్పంచ్ లు మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్ చేరారు.
పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు
BRS Leaders Joins Congress : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. ముస్తాబాద్ మండలంలో జడ్పీటీసీ గుండం నర్సయ్యతో సహా 8 గ్రామాల సర్పంచ్ లు మండల స్థాయి నాయకులు కారు దిగి చెయ్యెత్తి జై కొట్టారు. ముస్తాబాద్ మండలంలో జరిగిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో జడ్పీటీసీ నర్సయ్యతో సహా 500 మంది కాంగ్రెస్ లో చేరారు. అదే బాటలో నడిచేందుకు సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్స్ 8 మంది సిద్దమయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం... గతంలో ఈ ప్రాంత మంత్రి నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్ట్ ల పేరిట నిర్బంధించారని ఆరోపించారు.
ఆ కేసులను ఎత్తివేసేందుకు కృషి చేస్తా
కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా సమస్యలు విన్నవించుకునే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేటీఆర్ ను అడ్డుకున్నారని పెట్టిన కేసులను తొలగించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కేటీఆర్ అసమర్థత వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులోని 9వ ప్యాకేజీ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. ఆ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నేరుగా ఎమ్మెల్యే అయ్యి, కేసీఆర్ పుత్రునిగా మంత్రి అయిన కేటీఆర్ కు మంత్రి పదవి పోగానే జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తప్ప దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య బద్దంగా పాలించే పార్టీ లేదని స్పష్టం చేశారు. గతంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఇక్కడికి వచ్చాను...ఇప్పుడు మంత్రిగా సమస్యల పరిష్కారానికి వచ్చానని తెలిపారు. అప్పర్ మానేరు డ్యామ్ అభివృద్ధి పనులపై సీఎంతో హామీ తీసుకున్నామన్నారు.
ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రతి బూత్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్నారు. అందరు కష్టపడి పని చేయాలని సూచించారు. ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో త్వరలోనే అనేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభ తరువాత సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కరీంనగర్ లోక్ సభ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఎవరి బూత్ లో వాళ్లు గెలవాలి, కాంగ్రెస్ జెండా ఎగురాలన్నారు. ఎన్ఎస్యూఐ లీడర్ గా మార్క్ ఫెడ్ ఛైర్మన్ గా, ఎంపీగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మంత్రిగా ఎల్లారెడ్డి పేటకి వచ్చానన్నారు. ఆనాడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన విధంగా ఇప్పడు పార్లమెంట్ గెలవాలని సూచించారు. ఎల్లారెడ్డి పేట కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. వారికి ఏ సమస్య వచ్చినా తనతో చెప్పుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు సూచించారు.