Minister Ponnam Prabhakar : ఎవరి కాలి గోటికి ఎవరు సరిపోరో ప్రజలకే తెలుసు-కేటీఆర్ కు మంత్రి పొన్నం కౌంటర్
29 January 2024, 22:20 IST
- Minister Ponnam Prabhakar : తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చి 60 రోజులు కూడా కావడం లేదని, ఇంతలోనే బీఆర్ఎస్ నేతలు మతితప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కాలి గోటికి ఎవరు సరిపోరో ప్రజలకు తెలుసన్నారు.
పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన
Minister Ponnam Prabhakar : రాష్ట్రంలో ఎవరి కాలిగోటికి ఎవరు సరిపోరో తెలంగాణ ప్రజలకే తెలుసునంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలో రాజకీయం, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అనవసరంగా మిడిసి పడితే ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో నూతనంగా రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అలాగే బోలోని పల్లి నుంచి గట్ల నర్సింగాపూర్ వరకు, చంటయ్యపల్లిలో నిర్మించబోయే పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గట్ల నర్సింగాపూర్, రసూల్ పల్లి, మల్లారం గ్రామాల్లో కొత్త పంచాయతీ భవనాలకు శిలాఫకలం వేశారు.
మతితప్పి మాట్లాడుతున్నారు
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కేసీఆర్ కాలిగోటికి రేవంత్ రెడ్డి సరిపోడంటూ ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో ఘాటు వ్యాఖ్యలు చేయగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ దానిపై రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చి 60 రోజులు కూడా కావడం లేదని, ఇంతలోనే కొందరు మతితప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఎవరి కాలి గోటికి ఎవరు సరిపోరో ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రశ్నించే వారిని పోలీసులతో అరెస్ట్ చేయించారన్నారు. బీఆర్ఎస్ నేతలు అనవసరంగా ఊకే మొరగొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పల్లె దవాఖానలతో మెరుగైన వైద్యం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి పల్లె దవాఖానాను ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ముల్కనూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ముల్కనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహతో మాట్లాడతానని తెలిపారు. రాబోయే ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అనంతరం నియోజకవర్గంలో ఇతర గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)