Ponnam Vs kavitha: ఫులే విగ్రహ ఏర్పాటుపై పొన్నం, కవితల మధ్య మాటల యుద్ధం
23 January 2024, 7:45 IST
- Ponnam Vs kavitha: జ్యోతి రావు పులే విగ్రహం ఏర్పాటు పై మంత్రి పొన్నం ప్రభాకర్,బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్ధం కొనసాగిస్తుంది.
ఫులే విగ్రహ ఏర్పాటుపై మాటల యుద్ధం
Ponnam Vs kavitha: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో జ్యోతి రావు పులే విగ్రహం ఏర్పాటు చేయాలని ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.అయితే ఇదే విషయం పై మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"అణగారిన జీవితాల్లో వెలుగుల దారులు పంచిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే… ఆ మహనీయుడి విగ్రహం అసెంబ్లీ లో ప్రతిష్టించాలని మీరు కోరడం మరీ విడ్డూరంగా ఉంది.పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు యాదికి లేని మహాత్మా జ్యోతిరావు పూలే గారిని.....మీకు ఎరుక చేసిన తెలంగాణ ఓటర్ల చైతన్యానికి వందనం అని పొన్నం ఎద్దేవా చేశారు.
అణచివేత కు వ్యతిరేకంగా పూలే సలిపిన పోరాటమే మా ప్రభుత్వానికి ఆదర్శమని అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ అని పెట్టుకున్నాం, ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పారు.
మహాత్మా జ్యోతిరావు పూలే సర్వదా స్మరణీయుడని బీసీ లను వంచించిన మీరా బీసీ ల సంక్షేమం గురించి మాట్లాడేదని పొన్నం నిలదీశారు. నియంతృత్వానికి ఎదురు తిరిగితే ఒక బీసీ మహిళ అని చూడకుండా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ను ఏడిపించింది మీరు కాదా అని ప్రశ్నించారు.
బీసీ బిడ్డగా తాను అడుగుతున్నానని మీ నియోజకవర్గంలో ఎంతమంది బీసీలకు మీరు అధికారాలు ఇచ్చారని ప్రశ్నించారు. బీసీ మంత్రిగా ఉన్నా.....నేను ఉద్యమకారుడినేనని అణగారిన వర్గాలకు ఆప్తుడిని అన్నారు.
సబ్బండ కులాలకు సోదరుడినని మంత్రిగా ఉండి బీసీ ల హక్కుల కోసం పోరాడతా అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్ష పదవి , కార్యనిర్వహాక అధ్యక్ష పదవి , లీడర్ ఆఫ్ అపొజిషన్ బీసీ లకు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో శాసన సభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ బీసీ లకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
పొన్నం వ్యాఖ్యలకు కవిత కౌంటర్
"అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారని కవిత ప్రశ్నించారు.
భారత జాగృతి సంస్థ కోరడంపై అభ్యంతరమా? అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే అభ్యంతరమా అని కవిత ప్రశ్నించారు. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా అని అన్నారు.
స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాం ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే గారి విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తాం.భవిష్యత్తులో రాజకీయాల కోసం, సంకుచిత మనస్తత్వంతో, ఈ మహా కార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నానన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే మహోన్నతుడు, అణగారిన ప్రజల్లో చైతన్యం నింపిన మహా మనిషి! అందుకే ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుపునే కాకుండా యావత్ తెలంగాణ ప్రజల తరుపున వినమ్రంగా మరోసారి కోరుతున్నానని కవిత ప్రకటించారు.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా