Siddipet News : అమెరికాలో సిద్దిపేట యువకుడు అనుమానాస్పద మృతి, తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు
07 August 2024, 22:23 IST
- Siddipet News : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు విగత జీవిగా తిరిగొచ్చాడు. అమెరికా ఎంఎస్ చదివేందుకు వెళ్లిన సిద్దిపేటకు చెందిన యువకుడు...అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు.
అమెరికాలో సిద్దిపేట యువకుడు అనుమానాస్పద మృతి, తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు
Siddipet News : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువకుడు సమ్మామిష్ చెరువులో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఎంఎస్ కోర్సు చదివేందుకు కొడుకుని అప్పులు చేసి అమెరికా పంపించారు. ప్రయోజకుడై వచ్చి తమకు అండగా ఉంటాడన్న కుమారుడు విగత జీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.
సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం కుటిగల్ గ్రామానికి చెందిన తుశాలపురం మంగవ్వ,మహాదేవ్ దంపతుల పెద్ద కుమారుడు సాయి రోహిత్ (24). 2022లో సీవీఆర్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన సాయి రోహిత్ గత డిసెంబర్ 20న ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ వాషింగ్టన్ సియాటెల్ లోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి కాలేజీలో ఎంఎస్ చేస్తున్నాడు. కాగా రోహిత్ భారతదేశానికి చెందిన నలుగురు స్నేహితులతో కలిసి హాస్టల్ గదిలో నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో అతడు జులై 22న సాయంత్రం విహార యాత్రకు వెళ్లాడు. అనంతరం క్యాబ్ లో తిరిగి హాస్టల్ కి వస్తుండగా, మార్గమధ్యలో మరొక క్యాబ్ లోకి మారాడు. అప్పటి నుంచి సాయి రోహిత్ తిరిగి రూమ్ కి రాకపోవడంతో అతని స్నేహితుడు అవినాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు విచారణ చేపట్టగా జులై 24 న సమ్మామిష్ సరస్సులో అనుమానాస్పద స్థితిలో సాయి రోహిత్ మృతదేహన్ని కనుగొన్నారు. అనంతరం అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
సుమారు 15 రోజుల తర్వాత స్వగ్రామానికి మృతదేహం
జులై 25న సాయి రోహిత్ మరణం గురించి అతని స్నేహితులు తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (తానా ) సభ్యులకు సమాచారం అందించారు. కాగా వారందరి కృషితో సుమారు 15 రోజుల తర్వాత మంగళవారం సాయి రోహిత్ మృతదేహం స్వగ్రామమైన కుటిగల్ కు చేరుకుంది. దీంతో మృతదేహాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో బంధువులు,గ్రామస్థులు, స్నేహితులు గ్రామానికి చేరుకున్నారు. కొడుకు మృతదేహాన్ని చుసిన తల్లితండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన కొడుకు విగత జీవిగా తిరిగి వస్తాడని తాము అనుకోలేదని తల్లిదండ్రులు విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. అనంతరం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
సాయి రోహిత్ మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకొని మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.