Jangaon News : జనగామలో ఫైర్ క్రాకర్స్ దందా, రూ.23 లక్షల సరకు సీజ్-jangaon crime news task force police seized 23 lakh worth firecrackers illegally stored ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jangaon News : జనగామలో ఫైర్ క్రాకర్స్ దందా, రూ.23 లక్షల సరకు సీజ్

Jangaon News : జనగామలో ఫైర్ క్రాకర్స్ దందా, రూ.23 లక్షల సరకు సీజ్

HT Telugu Desk HT Telugu

Jangaon News : జనగామ జిల్లాలో బాణసంచా దందాకు పోలీసులు అడ్డుకట్టవేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్టోర్ చేసిన రూ.23 లక్షల విలువైన క్రాకర్స్ సీజ్ చేశారు.

జనగామలో ఫైర్ క్రాకర్స్ దందా, రూ.23 లక్షల సరకు సీజ్

Jangaon News : జనగామ జిల్లా కేంద్రంగా పెద్ద మొత్తంలో బాణసంచా (టపాసుల) దందా నడుస్తోంది. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే ఫైర్ క్రాకర్స్ గోదాముల్లో స్టోర్ చేయడం, కనీస నిబంధనలు కూడా పాటించకుండానే అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో విషయం కాస్త టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టికి చేరడంతో ఇల్లీగల్ దందా బండారం బయటపడింది. మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి, భారీ మొత్తంలో స్టోర్ చేసిన దాదాపు రూ.23 లక్షల విలువైన క్రాకర్స్ బాక్సులు సీజ్ చేశారు. ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జనగామ జిల్లా కేంద్రంగా కొన్నేళ్ల నుంచి ఇల్లీగల్ క్రాకర్స్ దందా సాగుతోంది. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన దారమ్ సత్యానారాయణ అనుగ్రహ ఫైర్ వర్క్స్ పేరున కొంతకాలం నుంచి టపాసుల బిజినెస్ నడిపిస్తున్నాడు. జనగామ నుంచి వరంగల్ ట్రై సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల కూడా సరఫరా చేస్తున్నాడు. వాస్తవానికి ఫైర్ క్రాకర్స్ బిజినెస్ చేయడానికి ముందుగా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంది. కానీ సత్యనారాయణ అలాంటి అనుమతులు ఏమీ లేకుండానే దందా సాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇల్లీగల్ దందా గురించి వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఉప్పందింది.

22.9 లక్షల సరకు సీజ్

సమాచారం అందుకున్న వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫైర్ సేఫ్టీ అధికారులతో కలిసి మంగళవారం జనగామ, ఓబుల్ కేశవాపూర్ శివారులో తనిఖీలు నిర్వహించారు. దారం సత్యనారాయణ అనుగ్రహ ఫైర్ వర్క్స్ లో సోదాలు చేసి అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన క్రాకర్స్ ను పట్టుకున్నారు. అక్కడి గోదాంలో స్టోర్ చేసి ఉన్న దాదాపు రూ.22,93,177 విలువైన క్రాకర్స్ ను సీజ్ చేశారు. అందులో రూ.9,24,247 టిమ్ టిమ్ క్రాకర్స్ 1070 బాక్సులు, రూ.54 వేల విలువైన టీసీఎం క్రాకర్ కార్టన్ బాక్సులు 100, రూ.1,02,701 విలువైన టీసీఎం అదర్ బాక్సులు 170, రూ.97,536 విలువైన క్రాకర్ కార్టన్ బాక్సులు 215, రూ.50,135 విలువైన 10 సీఎం క్రాకర్స్ 100, రూ.1,76,233 విలువైన 30 సీఎం కాటన్ బాక్సులు 280, రూ.8,88,326 విలువైన ఇతర 1050 బాక్సులు సీజ్ చేశారు. ఈ మేరకు ఇల్లీగల్ గా దందా చేస్తున్న అనుగ్రహ ఫైర్ వర్క్స్ యజమాని దారం సత్య నారాయణను అరెస్ట్ చేశారు. కాగా జనగామకు చెందిన మహంకాళి నటరాజ్, గుండా శ్రీనివాస్ పరారీలో ఉన్నారు. ఇదిలాఉంటే ఇల్లీగల్ దందా చేస్తున్న క్రాకర్స్ తో పాటు అరెస్ట్ చేసిన సత్య నారాయణను తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక జనగామ పోలీసులకు అప్పగించారు. అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ హెచ్చరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

సంబంధిత కథనం